హజ్రత్ అలీ(అ.స) ఖుర్ఆన్ యొక్క నిజమైన వ్యాఖ్యాత, ఖుర్ఆన్ కు సంబంధించిన అన్ని రకాల జ్ఞానం కలిగి ఉన్నవారు...
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) యొక్క సహచరులైన మన్సూర్ ఇబ్నె హాజిమ్ ఒక మంచి సంఘటనను ఉల్లేఖించారు:
ఒకరోజు ప్రజలతో ఇలా అడిగాను “మీకు తెలుసా, దైవప్రవక్త(స.అ) హుజ్జతుల్లాహ్(అల్లాహ్ నిదర్శనం, అల్లాహ్ తరపు నుండి నియమించబడినవారు) అనీ?” వారందరూ ఔను అని సమాధానమిచ్చారు.
నేను: దైవప్రవక్త(స.అ) మరణానంతరం సృష్టితాల పై అల్లాహ్ యొక్క హజ్జత్(మార్గదర్శి, నాయకుడు) ఎవరు?
ప్రజలు: ఖుర్ఆన్
నేను: నేను ఖుర్ఆన్ ను పరిశీలించాను అన్ని వర్గాల వారు దాని ద్వారానే తన వర్గాన్ని సరైన వర్గం అని నిరూపించడానికి నిదర్శనంగా ప్రదర్శిస్తారు. దాంతో ఖుర్ఆన్ యొక్క అంతరర్ధాలూ, గుప్తవార్తలు తెలిసిన సంరక్షకుడు లేకుండా కేవలం ఖుర్ఆన్ ను హుజ్జత్ గా నిర్ధారించలేమని తెలుసుకున్నాను. అప్పుడు వారితో మరలా ఖుర్ఆన్ యొక్క సంరక్షకుడు ఎవరు? అని ప్రశ్నించాను.
ప్రజలు: ఇబ్నె మస్ఊద్, ఉమర్, హుజైఫహ్...
నేను: వీరికి పూర్తి ఖుర్ఆన్ యొక్క జ్ఞానం ఉండేదా?
ప్రజలు: లేదు(వారికి పూర్తి జ్ఞానం లేదు)
నేను: ఇతడు ఖుర్ఆన్ యొక్క పూర్తి జ్ఞానం కలిగి ఉన్నాడు అన్న ఒక్క వ్యక్తి కూడా కనిపించలేదు కేవలం ఒక్క అలీ ఇబ్నె అబీతాలిబ్ తప్ప.[1]
దైవప్రవక్త(స.అ) తరువాత ఖుర్ఆన్ కు వ్యాఖ్యాత అవసరం:
దైవప్రవక్త(స.అ) ఖుర్ఆన్ యొక్క అంతరర్థాలన్నీ వివరించేశారు, ఇక ప్రజలకు ఖుర్ఆన్ వ్యాఖ్యాత అవసరం లేదు వారే స్వయంగా నేరుగా ఖుర్ఆన్ నుండి అంతా అర్ధం చేసుకోగలరు అని అని ఏ ఒక్కడు కూడా దావా చేయలేడు. ఈ మాటకు నిదర్శనం దైవప్రవక్త(స.అ) తరువాత ఇస్లామియ ఉమ్మత్ లో వైరుధ్యాలు మరియు వర్గాలు ఏర్పడ్డాయి అలాగే ఖుర్ఆన్ వ్యాఖ్యన గ్రంథాలు దైవప్రవక్త(అ.స) మరణించిన చాలా సంవత్సరాల తరువాత రచించబడ్డాయి. నిజానికి ఖుర్ఆన్ యొక్క నిజమైన లక్ష్యం విభేదాలనూ, వైరుధ్యాలను దూరం చేయడం. ఖుర్ఆన్ ఇలా ఉపదేశించెను: “వారు విభేదించుకునే ప్రతి విషయాన్నీ నువ్వు వారికి స్పష్టంగా విడమరచి చెప్పాలని మేము ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము”[2]
ఈ ఆయత్ నిరంతరం ఖుర్ఆన్ తో పాటు అల్లాహ్ తరపు జ్ఞానం పొందిన వ్యాఖ్యాత ఉండడం అవసరమని సూచిస్తుంది. అయితే ఇప్పుడు ప్రశ్నేమిటంటే దైవప్రవక్త(స.అ) మరణానంతరం ఖుర్ఆన్ వ్యాఖ్యనం మరియు వివరణ విషయంలో ఎవరిని ఆశ్రయించాలి?
ఖుర్ఆన్ వ్యాఖ్యనం తెలుసు అని ఎవరు దావా చేశారు?
చరిత్రలో చాలా మంది ఖుర్ఆన్ ను వ్యాఖ్యానించారు కాని వారిలో ఏ ఒక్కరూ నేను పూర్తి ఖుర్ఆన్ పై జ్ఞానం కలిగివున్నాను అని దావా చేయలేదు ఇక ముందు కూడ ఎవరూ చేయరు. చరిత్రలో ఇటువంటి దావా చేసినవారు కేవలం అహ్లెబైత్(అ.స) వారు మాత్రమే. ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) ఇలా ఉల్లేఖించారు: “ఖుర్ఆన్ యొక్క బాహ్యార్థం మరియు అంతరార్థం పూర్తిగా తెలిసు అని దావా ఎవరూ చేయలేరు ఔసియా(దైవప్రవక్త(స.అ) ఉత్తరాధికారులు) తప్ప”[3]
అహ్లెబైత్(అ.స) యొక్క విజ్ఞానం మరియు ప్రతిష్టతను వివరించే చాలా హదీసులు షియా మరియు అహ్ల సున్నత్ గ్రంథాలలో ఉల్లేఖించబడి ఉన్నాయి కాని వాటిని ఇక్కడ ప్రదర్శించదలుచుకోలేదు. ఇక్కడ కేవలం దైవప్రవక్త(స.అ) తరువాత వారి ఉత్తరాధికారులే ఖుర్ఆన్ వ్యాఖ్యానించడానికి అర్హులు అని వివరిస్తున్న ఆయతులను ప్రదర్శించాలనుకున్నాము.
ఖుర్ఆన్ వ్యాఖ్యనం కేవలం అహ్లెబైత్(అ.స) మాత్రమే చేయగలరు అని నిదర్శించే ఆయత్లు:
ఈ క్రమంలో చాలా ఆయతులను ప్రదర్శించవచ్చు కాని ఇక్కడ కొన్నింటిని మాత్రమే ప్రదర్శిస్తున్నాము..
1. ఖుర్ఆన్: పరిశుద్ధులు తప్ప దాని(యదార్థాలను మరియు రహస్యాలను) ముట్టుకోలేరు(తెలుసుకోలేరు).[4]
ఈ ఆయత్ యొక్క అర్ధం కేవలం ఉజూ లేకుండా ఖుర్ఆన్ ను ముట్టుకోలేరు అని కాదు, నిజానికి దాని యొక్క గుప్త మరియు యదార్థాలు పరిశుద్ధులకు తప్ప మరొకరికి తెలియవు[5] ఖుర్ఆన్ స్వయంగా పరిశుద్ధులు అంటే దైవప్రవక్త(స.అ) యొక్క అహ్లెబైత్(అ.స) అని “తత్హీర్”[6] ఆయత్ ద్వార నిదర్శించెను.
2. ఖుర్ఆన్: “ఈ విషయమై నాకూ-నీకూ మధ్య సాక్షిగా అల్లాహ్ మరియు గ్రంథజ్ఞానం గలవారు చాలు”[7]
ఈ ఆయత్ ద్వార అల్లాహ్, ఖుర్ఆన్ యొక్క పూర్తి జ్ఞానం కలిగివున్న వ్యక్తులు ఉన్నారు అని తెలియపరచాలనుకున్నాడు. నిస్సందేహంగా ఇలాంటి వ్యక్తులు ఉండగా ఇతరులకు ఖుర్ఆన్ వ్యాఖ్యాన అనుమతి ఇవ్వడంలో అర్థం లేదు. షియా మరియు అహ్లె సున్నత్ యొక్క చాలా రివాయతుల ఆధారంగా ఈ ఆయత్ హజ్రత్ అలీ(అ.స) గురించి అవతరించబడినది అని తెలుస్తుంది. ఉదాహారణకు అహ్లె సున్నత్ వర్గానికి చెందిన హాకిమె హస్కానీ ఈ ఆయత్ హజ్రత్ అలీ(అ.స) గురించి అని చాలా రివాయతులు ఉల్లేఖించారు.[8]
3. ఖుర్ఆన్: “ఒకవేళ మీకు తెలియకపోతే గ్రంథ జ్ఞానం గలవారిని అడిగి తెలుసుకోండి”[9]
ఈ ఆయత్ జ్ఞానపరంగా మరియు ధర్మం పరంగా ఏదైనా ప్రశ్న ఉంటే అహ్లెబైత్(అ.స)లనే ఆశ్రయించాలనే విషయంపై మంచి నిదర్శనం. నిస్సందేహంగా ఖుర్ఆన్ యొక్క వ్యాఖ్యానం కూడా ముస్లిములకు ఎదురొచ్చే ముఖ్యమైన సమస్యలలో ఒకటి. కాని ముఖ్యాంశమేమిటంటే ఈ “అహ్లె జిక్ర్” ఎవరు? మరియు వారి గురించి ఎలా తెలుసుకోవాలనే విషయం. చాలా రివాయతులనుసారం, ఈ ఆయత్ అహ్లెబైత్(అ.స) యొక్క ప్రతిష్టతకు సంబంధించినది అనీ వారే అహ్లెజిక్ర్ అని తెలుస్తుంది. ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) ఇలా ఉల్లేఖించారు: “ఖుర్ఆన్ యొక్క ఆధారంగా దైవప్రవక్త(స.అ) (పేరు) జిక్ర్, అయితే అయిమ్మహ్ లు దైవప్రవక్త(స.అ) యొక్క అహ్లెబైత్, అహ్లె జిక్ర్(ఇక్కడ జిక్ర్ అనగా దైవప్రవక్త, ఈ విధంగా జిక్ర్ యొక్క కుటుంబ సభ్యలు అనగా అహ్లెబైత్ లు)”[10]
రిఫరెన్స్
1. అల్ కాఫీ, భాగం1, పేజీ168
2. సూరయె నహ్ల్, ఆయత్64
3. బసాయిరుద్దరజాత్, భాగం1, పేజీ193
4. సూరయె వాఖిఅహ్, ఆయత్79
5. అల్ మీజాన్, భాగం19, పేజీ137
6. సూరయె అహ్జాబ్, ఆయత్33
7. సూరయె రఅద్, ఆయత్43
8. షవాహిదుత్తన్జీల్, భాగం1, పేజీ400-401
9. సూరయె తలాఖ్, ఆయత్10
10. అల్ కాఫీ, భాగం1, పేజీ210
వ్యాఖ్యానించండి