రమజాన్ మాసం యొక్క 4వ రోజు దుఆ భావర్ధాలు

గురు, 04/15/2021 - 10:14

ఓ అల్లాహ్! నన్ను ఈ రోజు(ఈ నెల)లో నీ ఆదేశాలను స్థాపించడానికై, అమలు చేయడానికై శక్తిని ప్రసాదించు...

రమజాన్ మాసం యొక్క 4వ రోజు దుఆ భావర్ధాలు

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్

రమజాన్ మాసం యొక్క 4వ రోజు దుఆలో ఉన్న భావర్థాలు మరియు బోధనల గురించి సంక్షిప్తంగా:

దుఆ: బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్, అల్లాహుమ్మా ఖవ్వినీ ఫీహి అలా ఇఖామతి అమ్రిక్, వ అజిఖ్నీ ఫీహి హలావత జిక్రిక్, వ ఔజి’ని ఫీహి లి అదాయి షుక్రిక బి కరమిక్, వహ్ఫజ్నీ ఫీహి బి హిఫ్జిక వ సిత్రిక యా అబ్ సరన్ నాజిరీన్.[1]
అనువాదం: ఓ అల్లాహ్! నన్ను ఈ రోజు(ఈ నెల)లో నీ ఆదేశాలను స్థాపించడానికై, అమలు చేయడానికై శక్తిని ప్రసాదించు. నీ స్మరణ యొక్క తియ్యదనాన్ని నాకు రచి చూపించు. నీ మహాత్మ్యముతో నీ పట్ల కృతజ్ఞతా భావం కలిగేటట్లు చేయి. చూపుగల వారిలోనే ఉత్తముడైన ఓ అల్లాహ్! ఈ రోజు (ఈ నెల)లో నీ రక్షణ మరియు గుప్తగుణము ద్వార నా పాపములను రహస్యంగా ఉంచు.    

ఈ దుఆ ద్వార మనం అల్లాహ్ ను వేడుకునే అంశాల వివరణ:
మొదటి అంశం: ఓ అల్లాహ్ నాకు శక్తిని ప్రసాదించు
రమజాన్ మాసం యొక్క 4వ రోజు దుఆ యొక్క మొదటి వాక్యంలో మేము అల్లాహ్ ను ఆయన ఆదేశాలను స్థాపించడానికై, అమలు చేయడానికై శక్తిని ప్రసాదించమని కోరుకుంటున్నాము. ఈ దుఆ ద్వార తెలిసే విషయమేమిటంటే ఇస్లాం ఆరోగ్యాన్ని ప్రాముఖ్యత ఇస్తుంది. రివాయతులలో దీని గురించి చాలా వివరంగా ఉంది. ఇమామ్ అలీ(అ.స) ఉల్లేఖనం: “నీ ప్రాపంచిక భాగాన్ని కూడా మరువబోకు”[సూరయె ఖసస్, ఆయత్77] ఈ ఆయత్ యొక్క ప్రాపంచిక భాగం అనగా అర్థం ఆరోగ్యం, బలం, అవకాశం, యవ్వనం మరియు ఉల్లాసం ను మరువబోకు, వీటి ద్వార పరలోకాన్ని పొందగలవు.[2] మరో రివాయత్ లో ఇలా ఉల్లేఖించబడి ఉంది: “పోగొట్టుకోనంత వరకు వాటి ప్రాముఖ్యత తెలిసిరానటువంటి రెండు అనుగ్రహాలు.. యవ్వనం మరియు ఆరోగ్యం”[3]
ఆరోగ్యంపై ఇస్లాం ప్రత్యేక దృష్టి ఉంది అనే విషయాన్ని ఈ హదీస్ వ్యక్తం చేస్తుంది. ఇస్లామీయ ఆదేశాలనుసారం సృష్టి యొక్క లక్ష్యాన్ని దృష్టిలో పెట్టి చూస్తే ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ అని తెలుస్తుంది. మానవుని సృష్టిలక్ష్యం అల్లాహ్ ఆదేశాలను స్థాపించడం, వాటి పట్ల విధేయత కలిగివుండడం. ఖుర్ఆన్ లో అల్లాహ్ ఈ విధంగా వివరించెను: “నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే”[సూరయె జారియాత్, ఆయత్56] రమజాన్ మాసం యొక్క 4వ రోజు దుఆ యొక్క మొదటి వాక్యం ద్వార అల్లాహ్ ను “ఓ అల్లాహ్! నన్ను ఈ నెలలో ఈ రోజున నీ ఆదేశాలను స్థాపించడానికై, అమలు చేయడానికై శక్తిని ప్రసాదించు” అని వేడుకుంటున్నాము.
అల్లాహ్ ఆదేశాలు స్థాపించడం అనగానేమి?
అల్లాహ్ ఆదేశ స్థాపనకు మరియు ఆరోగ్యానికి చాల దగ్గర సంబంధం ఉంది. ఆరోగ్యంగా లేని వారు అల్లాహ్ ఆదేశాలను స్థాపించే విషయంలో నిస్సహాయులుగా ఉంటారు. ఇస్లామీయ రివాయతుల ద్వార అల్లాహ్ ఆదేశ స్థాపన అనగా ఏమిటి అని చాస్తే చాలా విషయాలు ముందుకు వస్తాయి; ఇక్కడ వాటి నుంచి కొన్ని మీకోసం: 1. ఉపవాసం ఉండడం, 2. నమాజ్ చదవడం మరియు (నిర్ణిత సమయాలలో) జాగరణలు చేయడం, 3. అమ్ర్ బిల్ మారూఫ్ మరియు నహ్యి అనిల్ మున్కర్(మంచి పట్ల ప్రోత్సాహం మరియు చెడు నుండి ఆపడం), 4. పేదవారిని ఆదుకోవడం, 5. అల్లాహ్ మార్గంలో హజ్ మరియు జిహాద్ ను నిర్వర్తించడం, 6. ఇమామ్ మరియు వారి ప్రతినిధుల పట్ల విధేయత కలిగివుండడం, వారిని సహకరించడం. ఇవన్నీ జరగాలంటే ఆరోగ్యంగా ఉండడం అవసరం. ఇదే దుఆయె కుమైల్ లో ఈ విధంగా సూచించబడి ఉంది: “నీ సేవ కోసం నా శరీరభాగాలకు శక్తిని ప్రసాదించు, నా హృదయాన్ని ఆలోచన పరంగా పటిష్ఠించు”[4]

రెండవ అంశం: ఓ అల్లాహ్! నీ స్మరణలో వున్న తియ్యదనాన్ని నాకు రుచి చూపించు:
రమజాన్ మాసం, 4వ రోజు దుఆ యొక్క రెండవ వాక్యంలో మేము అల్లాహ్ ను ఆయన స్మరణ తియ్యదనం రుచిని చూపించు అని వేడుకుంటున్నాము. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ఉపదేశించెను: “విశ్వసించిన వారి హృదయాలు అల్లాహ్ స్మరణ ద్వారా తృప్తి చెందుతాయి. తెలుసుకోండి! అల్లాహ్ స్మరణ ద్వారానే హృదయాలు నెమ్మదిస్తాయి”[సూరయె రఅద్, ఆయత్28] అలాగే మరో చోట ఇలా ఉంది: “ఓ విశ్వాసులారా! అల్లాహ్ ను అత్యధికంగా స్మరించండి. ఉదయం, సాయంకాలం ఆయన పవిత్రతను కొనియాడండి”[సూరయె అహ్జాబ్, ఆయత్1,42]
అల్లాహ్ స్మరణ ప్రభావాలు ఖుర్ఆన్ మరియు హదీసులనుసారం:
1. అల్లాహ్ దృష్టిలో పడడం: ఖుర్ఆన్: “మీరు నన్ను స్మరించండి, నేను మిమ్మల్ని జ్ఞాపకముంచుకుంటాను. నాకు కృతజ్ఞులై ఉండండి. కృతఘ్నతకు పాల్పడకండి”[సూరయె బఖరహ్, ఆయత్152]
2. అల్లాహ్ యొక్క ప్రేమ: రివాయత్ లో ఇలా ఉంది: “అల్లాహ్ ను నిత్యం స్మరించేవాడి హృదయంలో అల్లాహ్ యొక్క ప్రేమ అధికారం చెలాయిస్తుంది”[5]
3. విముక్తి, సాఫల్యం: ఖుర్ఆన్: “ఎక్కువగా అల్లాహ్ ను స్మరిస్తూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు”[సూరయె జుముఅహ్, ఆయత్10]
4. షైతాన్ నుండి దూరం: ఖుర్ఆన్: “నిశ్చయంగా అల్లాహ్ భీతిపరులు(ముత్తఖీన్) తమకు ఎప్పుడైనా షైతాన్ తరపు నుంచి చెడు ఆలోచన తట్టినప్పుడు వారు (తమ ప్రభువు యొక్క ఔన్నత్య) స్మరణలో నిమగ్నులై పోతారు. దాంతో వెంటనే వారికి కనువిప్పు కలుగుతుంది”[సూరయె అఅరాఫ్, ఆయత్201]
అల్లాహ్ స్మరణకు దూరమైతే కలిగే ప్రభావాలు:
1. స్వియ పరాధ్యానం: మనిషి తనను తానే మరిచిపోతాడు. ఖుర్ఆన్: “మీరు అల్లాహ్ ను మరచిపోయిన వారి మాదిరిగా అయిపోకండి. (వారి ఈ విస్మరణ కారణంగా) అల్లాహ్ కూడా వారిని తమ ఆత్మలనే మరచిపోయిన వారిగా చేసేశాడు. ఇలాంటి వారే పరమ అవిధేయులు”[సూరయె హష్ర్, ఆయత్19]
2. షైతాన్ సహవాసం: ఖుర్ఆన్: “కరుణామయుని స్మరణ పట్ల గుడ్డిగా వ్యవహరించే వ్యక్తి పై మేము షైతానును నియమిస్తాము. ఇక వాడే అతనికి సహవాసిగా ఉంటాడు”[సూరయె జుఖ్రుఫ్, ఆయత్36]
3. ఇహలోకంలో కష్టాలు పరలోకంలో గుడ్డితనం: ఖుర్ఆన్: “అయితే నా ధ్యానం పట్ల విముఖత చూపినవాడి బ్రతుకు దుర్భరమైపోతుంది. ప్రళయదినాన మేమతన్ని గుడ్డివానిగా చేసి లేపుతాము”[సూరయె తాహా, ఆయత్124]

మూడవ అంశం: ఓ అల్లాహ్! నీ పట్ల కృతజ్ఞతా భావం కలిగేటట్లు చేయి:
కృతజ్ఞత అనగా అనుగ్రహాలను ఆలోచించడం మరియు దానిని వ్యక్తం చేయడం. అనుగ్రహాలను మరిచిపోవడం మరియు వాటిని కప్పిపెట్టడం కృతఘ్నత[6] అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ఉపదేశించెను: “మీ కొరకు చెవులను, కళ్లను, హృదయాలను తయారు చేసినది ఆయనే-మీరు కృతజ్ఞులుగా వ్యవహరిస్తారని!”[సూరయె నహ్ల్, ఆయత్78]
కృతజ్ఞత మూడు మంచి స్థానాలు కలిగి ఉంటుంది:
1. ఆలోచన పరమైన కృతజ్ఞత: అనగా ప్రసాదించబడ్డ అనుగ్రహాలను గుర్తు చేసుకొని వాటిని స్మరించి ప్రసాదించినవాడి పట్ల కృతజ్ఞత భావం తెలుపుకోవడం.
2. నోటి ద్వార కృతజ్ఞత తెలుపుకోవడం: అనుగ్రహాలను ప్రసాదించినవారికి నోటి ద్వార కృతజ్ఞత తెలుపుకోవడం.
3. అమలు ద్వార కృతజ్ఞత తెలుపుకోవడం: ఇవి రెండు రకాలు, ప్రసాదించబడ్డ అనుగ్రహాన్ని సరిగా ఉపయోగించడం మరియు ఆ అనుగ్రహాన్ని దానికి తగ్గ స్థానంలో ఉంచడం.[7]
చివరి అంశం: ఓ అల్లాహ్! నీ రక్షణ కలిపించు:
ఈ దుఆ చివరిలో అల్లాహ్ తో మాకు రక్షణ కల్పించు అని కోరుకుంటున్నాము. అల్లాహ్ రక్షణ కల్పించకపోతే మరెవరిలో మనకు రక్షణ కలిపించే శక్తి లేదు. ఆయనే మన సంరక్షకుడు.
ఓ అల్లాహ్! నీ గుప్తగుణము ద్వార మా పాపములను రహస్యంగా ఉంచు. 

రిఫరెన్స్
1. జాదుల్ మఆద్ – మఫాతీహుల్ జినాన్, పేజీ144
2. మఆనియుల్ అఖ్బార్, పేజీ325, హదీస్1. అమాలీ అల్ సదూఖ్, పేజీ228-229, హదీస్10
3. తస్నీఫు గురరుల్ హికమ్, పేజీ324, హదీస్7532
4. ముస్బాహుల్ ముతహజ్జిద్ వ సిలాహుల్ ముతఅబ్బిద్, భాగం2, పేజీ849
5. బిహారుల్ అన్వార్, (తా-బీరూత్), భాగం63, పేజీ325, హదీస్11
6,7. ఫర్హంగె సిఫాత్, అబ్బాస్ ఇస్మాయీలీ యజ్దీ, పేజీ139.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10