ఇమామ్ హుసైన్ ఇబ్నె అలీ(అ.స) ​​​​​​​

శుక్ర, 08/13/2021 - 04:24

హుసైన్ ఇబ్నె అలీ(అ.స) పాల్గొన్న యుద్ధాలు, వారి కాలంలో రాజకీయ మరియు సామాజిక పరిస్థితులు, అలాగే యజీద్(ల.అ) గురించి సంక్షిప్త వివరణ...
 

ఇమామ్ హుసైన్ ఇబ్నె అలీ(అ.స) ​​​​​​​

ఇమామ్ హుసైన్ ఇబ్నె అలీ(అ.స)
దైవప్రవక్త(స.అ) 3వ ఉత్తరాధికారి, అలీ మరియు ఫాతెమా యొక్క రెండవ కుమారుడు అయిన ఇమామ్ హుసైన్(అ.స) హిజ్రీ యొక్క 3వ సంవత్సరం, రమజాన్ మాసం 3వ తేదీన మదీనహ్‌లో జన్మించారు.[1]
హుసైన్ ఇబ్నె అలీ(అ.స) తన జీవిత కాలంలో ధైర్యానికి, స్వేచ్ఛతకు మరియు అన్యాయానికి ఎదురు తిరగడం లాంటి విషయాలలో ప్రఖ్యాతి చెందినవారు.
దైవప్రవక్త(స.అ) మరణించినప్పుడు ఇమామ్ హుసైన్(అ.స) వయసు ఆరు సంవత్సరాలు. దైవప్రవక్త(స.అ) మరణానంతరం దాదాపు 30 సంవత్సరాలు తండ్రితో పాటు ఉన్నారు. ఖిలాఫత్ అధికారానికి సంబంధించిన సంఘటను చూస్తూ పెరిగారు. తండ్రి మరణానంతరం రాజకీయ వ్యవహారాలలో 10 సంవత్సరాలు సోదరులు ఇమామ్ హసన్(అ.స)తో పాటు ఉన్నారు. ఇమామ్ హసన్(అ.స) మరణానంతరం 10 సంవత్సరాల ముఆవియహ్ యొక్క బలగం యొక్క శిఖరాన్ని చూశారు, ఎన్నో సార్లు అతడిని నిలదీశారు. ముఆవియా మరణానంతరం అతడి కుమారుడు యజీద్ అధికారానికి ఎదురుతిరిగి న్యాయంకోసం పోరాడి, మానవత్వాన్ని కాపాడుతూ హిజ్రీ 61వ సంవత్సరంలో ముహర్రం యొక్క 10వ తేదీన కర్బలా భూమిపై వీరమరణం పోందారు.

హుసైన్ ఇబ్నె అలీ(అ.స) పాల్గొన్న యుద్ధాలు
హుసైన్ ఇబ్నె అలీ(అ.స) ఖిలాఫత్ అధికారం పెడదారి పట్టిన సంఘటనలు చూశారు. వారు తమ తండ్రితో పాటు కలిసి ఇస్లాం అభివృద్ధి మరియు రక్షణ కోసం పోరాడారు. వారు నాకిసీన్, మారిఖీన్ మరియు ఖాసితీన్ లతో జరిగిన మూడు యుద్ధాలలో కూడా పాల్గొన్నారు.
జమల్ యుద్ధంలో అమీరుల్ మొమినీల్ సైన్యం యొక్క కుడి వైపు సైన్యాధికారిగా నియమించబడ్డారు. సిఫ్ఫీన్ యుద్ధంలో ఉపన్యాసాలు ఇచ్చి సైన్యంలో ధైర్యాన్ని నింపేవారు. ఖాసితీన్ లతో జరిగిన యుద్ధంలో తమ యుద్ధ నైపుణ్యాలను ప్రదర్శించారు.
ఇమామ్ అలీ(అ.స) మరణానంతరం, ఇదే విధంగా హుసైన్ ఇబ్నె అలీ(అ.స) తమ సోదరులయిన ఇమామ్ హసన్(అ.స)ను మద్ధతు తెలిపారు. వారి ప్రతీ మాటను అమలు పరిచేవారు. సంధి ఒప్పందంలో కూడా వారు ఉన్నారు. వారు సోదరుడితో పాటు షామ్ కు వెళ్లారు. సంధి ఒప్పందం తరువాత ఇమామ్ హసన్(అ.స) తిరిగి మదీనహ్ కు వచ్చినప్పుడు వారితో పాటు తిరిగి మదీనహ్ కు వచ్చేశారు.[2]

హుసైన్ ఇబ్నె అలీ(అ.స) కాలంలో రాజకీయ మరియు సామాజిక పరిస్థితులు
ఇస్లాం యొక్క మూలాలు దారి తప్పడం సఖీఫా నుంచి మొదలయ్యి ఉస్మాన్ కాలంలో పూర్తిగా వ్యాపించి, పూర్తి మార్గభ్రష్టతకు చేరుకున్నాయి. రెండవ మరియు మూడవ ఖలీఫాల కాలంలో ముఆవియా షామ్ లో అధికారిగా ఉన్నప్పుడే తనను ఖలీఫతుల్ ముస్లిమీన్ గా నిర్ధారించుకొని, ఇస్లామీయ దేశం యొక్క విధిని తన చేతుల్లో తీసుకొని ఇస్లాం వ్యతిరేక సమూహం అయిన అమవీలను ఇస్లాం ఉమ్మత్ పై రుద్దడం మొదలు పెట్టాడు. కొంతమంది దుర్మార్గులు ఉదా: జియాద్ ఇబ్నె అబీహ్, అమ్ర్ ఇబ్నె ఆస్, సమురహ్ ఇబ్నె జుందబ్ మొ.. వారి సహాయంతో దౌర్జన్యపు అధికారాన్ని నిర్మించి, ఇస్లాం నామరూపాలను మార్చేశాడు.
ముఆవియా అధికారం కాలంలో అతడికి ఎదురు తిరగకపోవడనికి మరియు విప్లవం మొదలు పెట్టకపోవడానికి రెండు[3] ముఖ్య కారణాలు ఉన్నాయి: 1. ముఆవియాతో ఇమామ్ హసన్(అ.స) సంధి ఒప్పందం 2. పైకి మంచివాడిగా నటించే ముఆవియా స్వభావం.

యజీద్
యజీద్ ఇస్లాం మరియు దాని ఆదేశాల పట్ల రవ్వంత విశ్వాసం లేనివాడు. అతడు అపరిపక్వ యువకుడు, మనోవాంఛల అనుచరుడు, మొండి, దూరఆలోచనలేని మరియు జాగ్రత్త లేనివాడు. యజీద్ అధికారంలో రాకముందే మనోవాంఛల బానిసగా మరియు తనకు నచ్చినదాని విషయంలో అతిగా ఉండడం లాంటి అలవాట్లు ఉండేవి. అధికారంలో వచ్చిన తరువాత కూడా కనీసం తన తండ్రి మాదిరి పైపైకి ఇస్లాంను గౌరవించనూ లేదు. అతడిలో ఉన్న నిర్లక్ష్యం, మనోవాంఛల వల్ల బహిరంగంగా ఇస్లామీయ ప్రత్యేక మరియు పవిత్ర ఆదేశాలను లెక్కచేయకుండా వాటిని కాళ్లతో తొక్కుకొని వెళ్లిపోయేవాడు. తన మనోవాంఛల ముందు దేన్ని లెక్కచేసేవాడు కాదు.
యజీద్ బహిరంగంగా మద్యం సేవించేవాడు, అవినీతికి పాల్పడేవాడు, పాపాలు చేసేవాడు, రాత్రిబసలలో మరియు ధనకుల విందులలో కూర్చున్నప్పుడు మద్యం సేవించేవాడు, నీఛమైన కవిత్వాలు చెప్పేవాడు[4]
అతడు స్పష్టంగా దౌత్యాన్ని మరియు హజ్రత్ ముహమ్మద్(స.అ) పై దైవవాణి అవతరణను నిరాకరించేవాడు. తన తాతా అబూసుఫ్యాన్ మాదిరి ఆలోచించేవాడు, అందుకే ఇమామ్ హుసైన్(అ.స)ను చంపిన తరువాత కవిత్వం రూపంలో ఇలా అన్నాడు: “హాషిమీయులు దేశం మరియు అధికారంతో ఆటాడుకున్నారు, పరలోకనుంచి వార్తా రాలేదూ దైవవాణీ రాలేదు(అంతా నాటకం)”
అతడి సభ అవినీతి మరియు పాపముల కేంద్రంగా మారింది. అతడి అవినీతి వ్యాప్తి ఎంతేలా వ్యాపించిదంటే మక్కా మదీనహ్ లాంటి పవిత్ర ప్రదేశాలను కూడా అపవిత్రంగా చేశాడు.
మనోవాంఛల మార్గంలో తన ప్రాణాలను కోల్పోయాడు. మద్యం సేవించడంలో మితిమీరి పోయాడు, అదే అతడికి విషమై అతడి ప్రాణాలు తీసింది.
ప్రముఖ ఇస్లామీయ రచయిత అయిన “మస్ఊదీ” ఇలా రచించెను: “ప్రజల పట్ల యజీద్ ప్రవర్తన ఫిర్ఔన్ పద్ధతి మాదిరి ఉండేది. ఇంకా చెప్పాలంటే ఫిర్ఔన్ పద్ధతి ఇతడి ప్రవర్తన కంటే బాగుండేది”[5]
దీంతో అతడి ఇస్లాం పట్ల శత్రుత్వం స్పష్టమౌతుంది, ముఆవియా చావుతో ఇమామ్ హుసైన్(అ.స)ను ఆపివేసే అంశాలు అంతమయ్యాయి. ఇక ఇప్పుడు హుసైన్ ఇబ్నె అలీ(అ.స) యజీద్ కు వ్యతికేరించే సమయం వచ్చింది. ఒకవేళ ఇమామ్ హుసైన్(అ.స) యజీద్ తో బైఅత్ చేసివుంటే ఈ బైఅత్ అతడు చేస్తున్న పనులు సరైనవి అన్న విషయంపై ఆధారమయ్యేది. కాని ఇమామ్ హుసైన్(అ.స) అతడి బైఅత్ ను నిరాకరించి, అతడితో పోరాడి, అతడి వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి స్పష్టంగా తెలియపరిచారు.

రిఫరెన్స్
1. సీమాయె పీష్వాయాన్, మహ్దీ పీష్వాయీ, పేజీ39.
2. ఇబ్నె హజర్ అస్ఖలానీ, అల్ ఇసాబహ్, తా1, బీరూత్, దారు ఇహ్యాయి అల్ తురాస్-అల్ అరబీ, 1328హి, భాగం1, పేజీ333.
3. సీమాయె పీష్వాయాన్, మహ్దీ పీష్వాయీ, పేజీ42-45.
4. సిబ్తె ఇబ్నె జౌజీ, తజ్కిరతుల్ ఖవాస్, నజఫ్, మన్షూరాతుల్ మక్తబతిల్ హైదరియహ్, 1383హి, పేజీ291.
5. మస్ఊదీ, మురవ్విజుజ్ జహబ్, భాగం3, పేజీ68.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 22