తీర్పుదినం పై నమ్మకం ఉంచడం అవసరం. దీనిని ఉలమాలు “ఉసూలె దీన్” నుంచి ఒక అస్ల్(మూలం)గా భావిస్తారు అనే విషయాల గురించి సంక్షిప్త వివరణ...
పుట్టిన ప్రతీ మనిషికి చావు తప్పదు. అయితే ఇక్కడ మేము మరణించిన తరువాత ఏమి జరుగుతుంది? అతడి పరిస్థితి ఏమిటి? దీని గురించి ఇస్లాం ఏమని ఉపదేశిస్తుంది అన్న విషయాల గురించి మాట్లాడుకుందాం.
మనిషి మరణించిన తరువాత పరిస్థితులను మరియు పరలోక జీవితం గురించి వివరించే అంశాలను “మఆద్” అనే పదాన్ని ఉపయోగిస్తారు. “మఆద్” పట్ల నమ్మకం ఉంచడం తప్పనిసరి. దీనిని ఉలమాలు “ఉసూలె దీన్” నుంచి ఒక అస్ల్(మూలం)గా భావిస్తారు.
మనిషి పుట్టుక ముందు నుంచి అంతిమ దినం వరకు ఖుర్ఆన్ లో ఇలా ఉపదేశించబడి ఉంది:
“ఓ ప్రజలారా! ఒకవేళ మరణానంతర జీవితం గురించి మీకేదన్నా సందేహం ఉంటే కాస్త ఆలోచించండి... మేము మిమ్మల్ని మట్టితో సృష్టించాము, ఆ తరువాత వీర్యపు బొట్టుతో, ఆపైన గడ్డకట్టిన రక్తంతో, అటు పిమ్మట మాంసపు ముద్దతో చేశాము-అప్పటికి అది రూపం కలదిగానూ, రూపరహితంగానూ ఉన్నది. మేము మీకు స్పష్టంగా తెలియజెప్పేందుకు (ఇదంతా చేస్తున్నాము). మరి మేము కోరిన దానిని నిర్ధారిత సమయం వరకు మాతృగర్భాలలో ఉంచుతున్నాము. ఆ తరువాత మిమ్మల్ని శైశవ దశలో బయటికి తెస్తాము – మరి మీరు నిండు యౌవనానికి చేరుకోవటానికి! మీలో కొందరు (యుక్త వయస్సుకు చేరక ముందే) మృత్యువుకు గురిచేయబడతారు. మరి కొందరు అన్నీ తెలిసి ఉండి కూడా ఏమీ గ్రహించలేనంత నికృష్టమైన మయస్సుకు చేర్చబడతారు. నేల ఎండిపోయి (బీడుగా మారి) ఉండటం నువ్వు చూస్తావు. ఆ తరువాత మేము దానిపై వర్షం కురిపించగానే అది పులకిస్తుంది, ఉబికి వస్తుంది, అన్ని రకాల మనోహరమైన మొక్కలను మెలకెత్తిస్తుంది. అల్లాహ్ యే సత్యం గనక, మృతులను తిరిగి బ్రతికించేవాడు ఆయనే గనక, అన్నింటిపై ఆయనే అధికారం కలవాడు గనక ఇదంతా జరుగుతోంది సుమా! (దీంతోపాటు) ప్రళయం రావటం తథ్యం. అందులో సందేహానికి ఆస్కారమే లేదు. నిశ్చయంగా అల్లాహ్ సమాధులలో ఉన్నవారిని తిరిగి లేపుతాడు”[1].
ప్రళయదినం ఖుర్ఆన్ దృష్టిలో
నిశ్చయంగా మేము మృతులను బ్రతికిస్తాము. జనులు ముందుగా చేసి పంపుకున్న దానినీ, వారు వెనుక వదిలివెళ్ళిన కర్మలను కూడా మేము వ్రాస్తూ పోతున్నాము. ఇంకా మేము ప్రతి విషయాన్నీ స్పష్టమైన ఒక గ్రంథంలో నమోదు చేసి పెట్టాము.[2].
ప్రతి ప్రాణికీ – అది చేసుకున్న దాన్ని బట్టి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ప్రజలు చేసేవన్నీ ఆయనకు బాగా తెలుసు.[3].
మరణం మరియు మరణాంతరజీవితం
ఇస్లాం దృష్టిలో మృత్యువు, ఈలోకం యొక్క చివరి స్థానం మరియు పరలోకం యొక్క మొదటి స్థానం. ముందుగా మరణం గురించి తెలుసుకోవడం అవసరం.
మృత్యువు
మృత్యువు తప్పకుండా సంభవిస్తుంది. అది కేవలం మనుషులకు మాత్రమే సంబంధించింది కాదు, ఇది ప్రపంచంలో ఉన్న జీవరాసులందరికి సంబంధించినది. ఖుర్ఆన్ ఈ యదార్థం గురించి వివిధ రకాలుగా వివరించెను: “మీరెక్కడ ఉన్నాసరే, మృత్యువు మిమ్మల్ని కబళిస్తుంది. ఆఖరికి మీరు పటిష్టమైన కోటలలో ఉన్నాసరే(అది మిమ్మల్ని వదలదు)”[4]
“(ఓ ప్రవక్తా!) నీకు పూర్వం కూడా మేము ఏ మానవుణ్ణీ శాశ్వతంగా జీవించి ఉండేట్లుగా చేయలేదు. ఒకవేళ నువ్వు చనిపోతే, వాళ్లు మాత్రం శాశ్వతంగా బ్రతికి ఉంటారా ఏమిటీ?”[5]
భూమండలంపై ఉన్నవారందికి మరణం సంభివిస్తుంది అని కూడా సూచించబడి ఉంది:
“భూమండలంపై ఉన్నవారంతా నశించి పోవలసినవారే. ఎప్పటికీ మిగిలి ఉండేది ఘనత, గౌరవం గల నీ ప్రభువు అస్తిత్వం మాత్రమే”[6]
కొన్ని ఆయతులలో మృత్యువు ప్రాణులందరికీ మృత్యువు చెందుతాయి అని సూచిస్తుంది:
“ప్రతి ప్రాణీ మృత్యువు రుచి చూడవలసిందే”[7]
అందుకని ఇస్లాం దృష్టిలో ఏ మనిషీ శాశ్వతంగా ఉండడు.
“అల్లాహ్ యే ఆత్మలను వాటి మరణ సమయంలో స్వాధీనం చేసుకుంటాడు. మరణం రాని వారి ఆత్మలను కూడా వాటి నిద్రావస్థలో ఆయన వశపరచుకుంటున్నాడు. మరి మరణ ఉత్తర్వు ఖరారైన వారి ఆత్మలను ఆపుకుంటున్నాడు. ఇతర ఆత్మలను ఒక నిర్ణీత గడువు వరకు వదలిపెడుతున్నాడు. చింతన చేసే వారి కోసం ఇందులో ఎన్నో సూచనలున్నాయి”.[8]
వారు ఆత్మను గురించి నిన్ను ప్రశ్నిస్తున్నారు. “ఆత్మ నా ప్రభువు ఆజ్ఞతో (ముడిపడి) ఉంది. మీరు ఒసగబడిన జ్ఞానం బహుస్వల్పం” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.[9]
“ఓ ప్రశాంత మనసా! నీ ప్రభువు వైపు పద! నువ్వు ఆయన పట్ల సంతోషించావు. ఆయన నీ పట్ల సంతోషించాడు. కాబట్టి (సత్కరించబడిన) నా దాసులతో చేరిపో. నా స్వర్గంలో చేరిపో”[10]
మరణం సమీపంలో ఉన్న ఒక వ్యక్తి అతడు లేదా ఆమె చనిపోతాడని తెలిసిపోతుంది. పాపాత్ముల ఆత్మ పోవడం తీవ్రమైన నొప్పితో కూడి ఉంటుంది. మరణ క్షణం గురించి ఖుర్ఆన్ లో ఇలా ఉంది:
“అసంభవం. (గుండెలోని) ప్రాణం గొంతు ప్రక్కన గల ఎముక వరకూ చేరుకున్నప్పుడు, ‘మంత్రించి నయం చేసే వాడెవడైనా ఉన్నాడా?’ అని అనబడినప్పుడు, ‘పోయేకాలం వచ్చింద’న్న సంగతిని అతను తెలుసుకున్నప్పుడు, ఒక పిక్క మరో పిక్కతో ఒడుసుకున్నప్పుడు, (ఓ మానవాత్మా!) ఈ రోజు నీవు నీ ప్రభువు వైపు సాగిపోవలసి ఉంటుంది”[11].
తీసుకోవలసిన ఇద్దరు(దూతలు) తీసుకోవటానికి వెళ్ళినప్పుడు (వారిలో) ఒకతను కుడి ప్రక్కన, మరోకతను ఎడమ ప్రక్కన కూర్చొని ఉంటాడు. (మనిషి) నోట ఒక మాట వెలువడటమే ఆలస్యం, అతని దగ్గర ఒక పర్యవేక్షకుడు (దాన్ని నమోదు చేయడానికి) సిద్ధంగా ఉంటాడు. చివరికి మరణ మైకం –సత్య సమేతంగా- రానేవచ్చింది. ‘(ఓ మనిషీ!) దేనిపట్ల నువ్వు బెదిరి పారిపోయేవాడివో అదే ఇది’ మరి శంఖం ఊదబడుతుంది. (శిక్ష గురించి) వాగ్దానం చేయబడిన రోజు ఇదే. ప్రతి వ్యక్తీ తన వెంట తనను తీసుకొచ్చేవాడొకడు, సాక్ష్యమిచ్చేవాడొకడు ఉన్న స్థితిలో హాజరవుతాడు. (అతనితో ఇలా అనబడుతుంది:) “నిశ్చయంగా నువ్వు దీని పట్ల అలసత్వం వహించావు. ఇక నీ నుండి నీ తెరను తొలగించాము. ఈనాడు నీ చూపు చాలా సునిశితంగా ఉంది”[12].
రిఫరెన్స్
1. సూరయె హజ్, ఆయత్5-7.
2. సూరయె యాసీన్, ఆయత్12.
3. సూరయె జుమార్, ఆయత్70.
4. సూరయె నిసా, ఆయత్ 78.
5. సూరయె అంబియా, ఆయత్34.
6. సూరయె రహ్మాన్, ఆయత్26,27.
7. సూరయె ఆలి ఇమ్రాన్, ఆయత్185.
8. సూరయె జుమర్, ఆయత్42.
9. సూరయె ఇస్రా, ఆయత్85.
10. సూరయె ఫజ్ర్, ఆయత్27-30.
11. సూరయె ఖియామత్, ఆయత్26-30.
12. సూరయె ఖాఫ్, ఆయత్17-22.
వ్యాఖ్యానించండి