స్త్రీ గురించి ఖర్ఆన్ మరియు దైవప్రవక్త(అ.స) యొక్క కొన్ని హదీసుల ఆధారంగా కొన్ని అంశాల వివరణ

ఇస్లాం దృష్టిలో, పురుషుడు మరియు స్ర్తీ; ఇద్దరి లక్ష్యం – అనగా మనిషిని సంపూర్ణ స్థాయికి చేర్చడంలో– ఒకటే. ఈ లక్ష్యాన్ని చేర్చడంలో ఇద్దరూ సమానులే. ఒకరు గొప్ప మరొకరు అల్ప అన్న మాటే తప్పు. ఇక జీన్సు పరంగా సృష్టి అవసరాన్ని బట్టి వారు వేర్వేరుగా ఉంటారు. అలా అని పురుషుడు ఏ విధంగా స్ర్తీని తక్కువగా భావించకూడదు అలాగే స్ర్తీ పురుషుడ్ని తక్కువ చేసి చూడకూడదు.
ఇస్లాం ఉపదేశాలనుసారం స్ర్తీ గురించి సంక్షిప్తంగా ఇలా చెప్పవచ్చు:
1. మహిళ, సౌందర్యం, గాంభిర్యం మరియు శాంతికి చిహ్నం.
2. స్త్రీ, మగాడికి మనశాంతికి కారణం. మగాడు స్ర్తీ యొక్క భరోసా, సంరక్షకుడు.
3. స్త్రీ పురుషులకు సంబంధించి సూచించబడ్డ వేర్వేరు అహ్కాములు అన్యాయం లేదా మగవాడి పెత్తనాన్ని సూచించవు, ఈ బేధం కేవలం సమాజం మరియు కుటుంబ బాధ్యతల నుంచి పుడుతుంది అంతే.
అల్లాహ్ తరపు నుంచి అవతరించబడ్డ ప్రవక్తలందరూ మానవజాతిని ఉద్దేశించి ఆహ్వానించేవారు. “నన్ను అనుసరించినవాడే నావాడు”.[సూరయె ఇబ్రాహీమ్, ఆయత్39]
అల్లాహ్ దృష్టిలో ఎవరూ ఎక్కువ కాదు. ఆయన దృష్టిలో కేవలం భయభక్తులు గలవారే అల్లాహ్ సమక్షంలో ఎక్కువ ఆదరణీయుడు.
ఖుర్ఆన్‌లో ఇలా ఉపదేశించబడి ఉంది:
“ఓ మానవులారా! మేము మిమ్మల్ని ఒకే పురుషుడు, ఒకే స్ర్తీ ద్వారా సృష్టించాము. మరి మీ (పరస్పర) పరిచయం కోసం మిమ్మల్ని వివిధ వర్గాలుగా, తెగలుగా చేశాము. యదార్థానికి మీలో అందరికన్నా ఎక్కువగా భయభక్తులు గలవాడే అల్లాహ్ సమక్షంలో ఎక్కువ ఆదర ణీయుడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, అప్రమత్తుడు”.[సూరయె హుజురాత్, ఆయత్13]
దాసోహం కలిగివున్న వారే అల్లాహ్‌కు అతి సమీపంలో ఉన్నవారు, వారు మగవారు కానివ్వండి లేదా ఆడవారు కానివ్వండి. ఖుర్ఆన్‌లో ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి.
“మహిళలు” అనే ఖుర్ఆన్ యొక్క పూర్తి అధ్యాయం ఒక మహిళ యొక్క ఆధ్యాత్మికతను, ఆమె దేశీయ మరియు సామాజిక హక్కులను చర్చిస్తుంది. అధ్యాయం ఇలా ప్రారంభమవుతుంది:
“ఓ మానవులారా! మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి పుట్టించి, దాన్నుంచే దాని జతను కూడా సృష్టించి, ఆ ఇద్దరి ద్వారా ఎంతో మంది పురుషులను, స్త్రీలను వ్యాపింపజేసిన మీ ప్రభువుకు భయపడండి”.[సూరయె నిసా, ఆయత్01]
ఖుర్ఆన్ ఇలా ఉపదేశిస్తుంది:
“ఓ ప్రవక్త! విశ్వసించిన స్త్రీలు మీకు రాజకీయ మరియు మత విశ్వాసాల పట్ల విధేయతగా ఉంటామని ప్రమాణం చేయడానికి వచ్చినప్పుడు... వారి విధేయతను అంగీకరించు”[సూరయె ముమ్తహినహ్, ఆయత్12]
సమాజంలో మహిళల హక్కులను వివరించే ఖుర్ఆన్ యొక్క కొన్ని ఆయతులు:
“తల్లిదండ్రులు, సమీప బంధువులు వదిలివెళ్ళిన ఆస్తిలో పురుషులకు భాగం ఉంది. అలాగే తల్లిదండ్రులు, సమీప బంధువులు వదిలివెళ్ళిన ఆస్తిలో స్త్రీలకు కూడా భాగం ఉంది. ఆ ఆస్తి తక్కువైనాసరే, ఎక్కువైనా సరే (అందులో) వాటా మాత్రం నిర్ధారితమై ఉంది”.[సూరయె నిసా, ఆయత్07]
“విశ్వసించిన ఓ ప్రజలారా! మీరు బలవంతంగా స్త్రీలకు వారసులై కూర్చోవటం మీకు ధర్మసమ్మతం కానేరదు. మీరు వారికి ఇచ్చిన దానిలో (మహ్ర్) నుంచి కొంత సొమ్ము కాజేసే ఉద్దేశ్యంతో వారిని ఆపి ఉంచుకోకండి. ఒకవేళ వారు గనక బాహాటంగా ఏదైనా నీతిమాలిన పనికి పాల్పడితే అది వేరే విషయం. వారితో ఉత్తమరీతిలో కాపురం చేయండి. ఒకవేళ వారు మీకు నచ్చకపోతే బహుశా ఏదో ఒక్క విషయం మూలంగా మీకు నచ్చకపోవచ్చు. కాని మీకు నచ్చని ఆ విషయంలోనే అల్లాహ్ అపారమైన శుభాన్ని పొందుపరచాడేమో! (మీకేం తెలుసు?)”[సూరయె నిసా, ఆయత్19]
“పురుషులు సంపాదించిన దానిని బట్టి వారి భాగం వారికుంటుంది. అలాగే స్త్రీలు సంపాదించిన దానినిబట్టి వారి భాగం వారికుంటుంది.”[సూరయె నిసా, ఆయత్32]
“సత్కార్యాలు చేసేవారు పురుషులైనా, స్త్రీలయినా – విశ్వాసులై ఉంటే మేము వారికి అత్యంత పవిత్రమైన జీవితాన్ని ప్రసాదిస్తాము. వారి సత్కార్మలకు బదులుగా సత్ఫలితాన్ని కూడా మేము వారికి తప్పకుండా ఇస్తాము”.[సూరయె నహ్ల్, ఆయత్97]
దైవప్రవక్త(స.అ) స్త్రీ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఈ విధంగా సెలవిచ్చారు: ఎవరైతే తమ స్త్రీలతొ మంచితనంతో వ్యవహరిస్తారో వారే ప్రళయం నాడు నాకు దగ్గరగా ఉండటానికి అర్హులు.
దైవప్రవక్త(స.అ): మంచి పద్దతులను అలువరించుకొండి మరియు ఇరుగు పొరుగువారితో దయాగుణంతో ప్రవర్తించండి మరియు మీ యొక్క స్త్రీలను గౌరవించండి, మీరుగాని ఇలా చేస్తే ఎటువంటి లెక్కింపు లేకుండా స్వర్గంలొకి ప్రవేశిస్తారు.[1]
దైవప్రవక్త(స.అ) వేరొక చోట ఈ విధంగా సెలవిచ్చారు: సిగ్గును పది భాగాలుగా విభజిస్తే అందులో తొమ్మిది భాగాలు స్త్రీలలో మరియు ఒక భాగం పురుషులలో పొందుపరిచబడినది.[2].
ఒక స్త్రీలో అందం కంటే ముఖ్యమైనది ఆత్మసౌందర్యం, దీనిని ఎల్లప్పుడు కాపాడుకోవడంలోనే ఇహపరలోకాలలో స్త్రీకి విజయం ఉంది.
రిఫరెన్స్
1. షేఖ్ సదూఖ్, అత్ తౌహీద్, పేజీ127.
2. కన్జుల ఉమ్మాల్, భాగం3, పేజీ121, హదీసు5769.
వ్యాఖ్యానించండి