ఇమామ్ ముహమ్మద్ తఖీ(అ.స) యొక్క దైవ జ్ఞానాన్న మరియు వారి ఇమామత్ పై చరిత్ర నిదర్శనలు

ఇమామ్ ముహమ్మద్ తఖీ(అ.స) యొక్క దైవ జ్ఞానాన్న మరియు వారి ఇమామత్ పై చరిత్ర నిదర్శనలు
చోరుడి శిక్ష పై ఇమామ్ ముహమ్మద్ తఖీ[అ.స] నిదర్శనం
“జుర్ఖాన్” అనే వ్యక్తి మరియు “ఇబ్నె అబీదావూద్” అనే వ్యక్తి మధ్య మంచి స్నేహం ఉండేది. జుర్ఖాన్ ఇలా ఉల్లేఖించెను: ఒకరోజు ‘ఇబ్నె అబీదావూద్’, ‘మోతసిమ్’ దర్బారు నుండి చాలా నిరాశతో, చాలా దుఖంతో తిరిగి వచ్చాడు. కారణమేమిటని అడిగాను. ఇరవై ఏళ్ల క్రింతమే చచ్చిపోయి ఉంటే బాగుండేది అని ఈనాడు అనిపించింది! అని అన్నాడు. ఎందుకు? అని అడిగాను. ‘మోతసిమ్’ దర్బారులో అబూజాఫర్(ఇమామ్ ముహమ్మద్ తఖీ) చేసిన పని వల్ల అన్నాడు. ఏం జరిగిందో చెప్పు అని అడిగాను. అతడు ఇలా అన్నాడు: ఒకవ్యక్తి తను చేసిన దొంగతనాన్ని ఒప్పుకొని ఖలీఫాను ఇస్లాం చట్టం ప్రకారం తనను పవిత్రుడ్ని చేయమని కోరాడు. ఖలీఫా, ఫిఖా పండితులందరితో పాటు ముహమ్మద్ ఇబ్నె అలీ(ఇమామ్ ముహమ్మద్ తఖీ) ను కూడా ఆహ్వానించారు. మమ్మల్ని ఈ దొంగ చేతులను ఎక్కడి నుండి నరకాలి? అని ప్రశ్నించారు. నేను “చేతిమణికట్టు నుండి” అని అన్నాను. ఎందుకని? అని ప్రశ్నించారు. ఎందుకంటే ఖుర్ఆన్ ‘తయమ్ముమ్’ ఆయత్[సూరయె మాయిదహ్, ఆయత్5]లో చేయి అని ఉద్దేశించి దానిని మణికట్టు వరకు అని చెప్పంది, అని అన్నాను. ఈ నిర్ణయంలో కొందరు నాతో ఏకీభవించి ఔను చోరుడి చేయి మణికట్టు వరకు నరకాలి, అని అన్నారు. కాని ఇంకొందరు “కాదు మోచేయి నుండి నరకాలి” అని అన్నారు. వారిని కూడా వారి ఈ మాట పై నిదర్శన చూపమని అన్నారు. వారు సాక్ష్యంగా ఖుర్ఆన్ యొక్క ‘ఉజూ’ ఆయత్ ను ప్రదర్శించారు. అప్పుడు మోతసిమ్, ముహమ్మద్ ఇబ్నె అలీ(ఇమామ్ ముహమ్మద్ తఖీ)ను అభిముఖిస్తూ ఇలా ప్రశ్నించాడు: ఈ విషయంలో మీ అభిప్రాయమేమిటి? వారు “వీళ్లు చెప్పారు కదా, నన్ను మన్నించండి(నన్ను అడగకండి)” అని అన్నారు. మెతసిమ్ మీ అభిప్రాయం కూడా చెప్పాలీ అని ప్రమాణం గుర్తు చేసి చాలా ప్రాధేయపడ్డాడు.
ముహమ్మద్ ఇబ్నె అలీ(అ.స) ఇలా అన్నారు: నీవు ప్రమాణం గుర్తు చేశావు గనుక నేను నా అభిప్రాయాన్ని చెబుతున్నాను; వీళ్ళు పొరబడుతున్నారు, కేవలం చోరుడి చేతి వ్రేళ్ళను మాత్రమే నరకాలి, మిగిలిన చేతిని అలాగే ఉంచాలి. మోతసిమ్, దీని పై మీ సాక్ష్యం అని ప్రశ్నించాడు. ఇమామ్ ఇలా అన్నారు: దైవప్రవక్త(స.అ) వచనానుసారం: సాష్టాంగం(సజ్దహ్) చేసే టప్పుడు శరీరం యొక్క ఏడు భాగాలు నేలకు తాకాలి; ముఖం(నొసలు), రెండు అరచేతులు, రెండు మోకాలు, రెండు కాళ్ళు(కాలి పెద్ద వ్రేలు). ఈ విధంగా చేయిని మణికట్టు లేదా మోచేయి వరకు నరకడం వల్ల నమాజ్ ను ఆచరించడానికై చేయి ఉండదు, మరి అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: “మస్జిదులు(అనగా సజ్దహ్ చేయబడే శరీరపు ఏడు భాగాలు) కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కాబట్టి (వాటిలో) అల్లాహ్ తోపాటు ఇతరులెవరినీ పిలవకండి(అనగా అల్లాహ్ నే ప్రార్ధించండి).[సూరయె జిన్, ఆయత్18]. అల్లాహ్ కు ప్రత్యేకించబడిన వాటిని నరకలేము.
ఇబ్నె అబీదావూద్ ఇలా అన్నాడు: మోతసిమ్, ముహమ్మద్ ఇబ్నె అలీ(అ.స) యొక్క సమాధానాన్ని సమ్మతించి చోరుడి చేతి వ్రేళ్ళు మాత్రమే నరకండి, అని ఆదేశించాడు. (అక్కడున్న వారిలో మా గౌరవం పోయింది!) నేను అక్కడే (సిగ్గుతో) చావును కోరాను.[1]
ఇమామ్ ముహమ్మద్ తఖీ(అ.స) యహ్యా ఇబ్నె అక్సమ్ మాటల్లో
“ఖాజీ యహ్యా ఇబ్నె అక్సమ్”, ఇతను దైవప్రవక్త(స.అ) వంశం పట్ల వైరంగల వారిలో ఒకడు, వివిధ సందర్భాలలో మరియు “ఖలీఫయే అబ్బాసీ” మరియు “బనీఅబ్బాస్” పెద్దల సమక్షంలో 9 సంవత్సరాల వయసు గల ఇమామ్ ముహమ్మద్ తఖీ(అ.స) చేతుల్లో ఓడిపోయాడు. అతడు ఇలా ప్రవచించెను: ఒకరోజు నేను దైవప్రవక్త(స.అ) సమాధి వద్ద ఇమామ్ జవాద్(అ.స)ను చూశాను, అతనితో వివిధ సమస్య గురించి సంభాషించాను అతను అన్నీంటికి జవాబిచ్చారు. అతనితో “అల్లాహ్ సాక్షిగా! నేను మీతో ఒకటడగాలనుకుంటున్నాను కాని సిగ్గు పడుతున్నాను” అని అన్నాను. ఇమామ్ ఇలా అన్నారు: “నీ ప్రశ్న నీ నోటి నుండి రాకుండానే నేను నీకు జవాబిస్తాను; “నీ ఇమామ్ ఎవరూ?” అని అడగాలనుకున్నావు”. “అల్లాహ్ సాక్షిగా! అవును నేను ఇదే అడగాలనుకున్నాను”, అన్నాను. అప్పుడు ఇలా అన్నారు: “నేనే ఇమామ్ ను”. “మీ ఈ వ్యాజ్యం పై ఏదైనా నిదర్శనం ఉందా?” అని అడిగాను. అప్పుడు ఇమామ్ చేతిలో ఉన్న కర్ర మాట్లాడడం మొదలుపెట్టింది అది ఇలా అంది: “ఇతను నా స్వామి మరియు అల్లాహ్ యొక్క హజ్జత్”.[2]
రిఫరెన్స్
1. సీరయే పీష్వాయాన్, మహ్దీ పీష్వాయి, పేజీ549, దారుల్ ఇల్మ్, 1388.
2. కులైనీ, మొహమ్మద్ ఇబ్నె యాఖూబ్, ఉసూలె కాఫీ, భాగం1, పేజీ353.
వ్యాఖ్యానించండి