పవిత్ర గ్రంథం ఖుర్ఆన్ గురించి, దాని పట్ల విశ్వాసం మరియు దాని పేర్ల గురించి సంక్షిప్త వివరణ...

ఖుర్ఆన్, దైవప్రవక్త(స.అ) యొక్క ఎప్పటికీ మిగిలి ఉండిపోయే అద్భుతం. ఈ గ్రంథం జ్ఞాన సముద్రం. మనిషిని తీర్చిదిద్దే మరియు మానవత్వ శిక్షణా గ్రంథం. కాంతి, వెలుగు మరియు తత్వాజ్ఞానం గల గ్రంథం. సమర్థత, ఆలోచన, ప్రవీణత మరియు దైవ ఎరుక గల గ్రంథం.
ఖుర్ఆన్; విశ్వాసం, మంచి పనులు, జిహాద్ మరియు సమాజ సమానత్వం గల గ్రంథం. శుభవార్తలు, ప్రమాణాలు గల గ్రంథం. చరిత్రను సృషించిన గ్రంథం. రాజకీయం, రాజనీతి మరియు చట్టంగల గ్రంథం. ఎప్పటికి అంతకాని, అన్ని చోట్ల ఉన్న, ప్రతీ విషయం ఉన్న ఒక సంపూర్ణ గ్రంథం. ఈ గ్రంథం ఒక మార్గదర్శి, అల్లాహ్ ఉపదేశాలు, నింగి నుండి అవతరించబడ్డ దైవవాణి.
ఈ పవిత్ర ఖుర్ఆన్ దశల వారిగా 23 సంవత్సరాలలో వివిధ సంధర్భాలలో అవసరానికి బట్టి అవతరించబడింది. ఇస్లామీయ అహ్కాములు, సిద్ధాంతాలు, విశ్వాసాలు మరియు జ్ఞానం దైవవాణి రూపంలో దైవప్రవక్త(స.అ) పై అవతరింపబడేది, దైవప్రవక్త(స.అ) కూడ ఆ గ్రంథ ఆయత్లను ప్రజలకు చెప్పేవారు. దైవవాణిని లిఖించేవారు దానిని వ్రాసి భద్రపరిచేవారు. దైవవాణిని లిఖించేవారిని “కాతిబె వహీ”(దైవవాణి లేఖి) అనేవారు. వారిలో ముఖ్యమైన వ్యక్తి హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్(స.అ).[1]
ఖుర్ఆన్ పట్ల విశ్వాసం
షేఖ్ రజా అల్ ముజఫ్ఫర్ తమ పుస్తకం “అఖాయిదుల్ ఇమామియాహ్”లో ఇలా వ్రాశారు: ఖుర్ఆన్ పట్ల మా విశ్వాసం “అది దైవవాణి. అల్లాహ్ తరపు నుండి అవతరించబడినది. అందులో ప్రతీ దాని గురించి ప్రస్తావించి ఉంది. ఖుర్ఆన్ మన దైవప్రవక్త(స.అ) యొక్క ఇప్పటి వరకు, మరి ఇప్పటికీ ఎప్పటికీ మిగిలి ఉండే అద్భుతకృత్యము. మనిషి దానికి పోలినది తీసుకు రాలేనటువంటి దాని సమయోచిత భాషణము మరియు అనర్గళత్వము, అందులో ఉన్న యదార్ధాలకు మరియు అతి ఉత్తమ జ్ఞానానికి జవాబు అసాధ్యం, అందులో ఎటువంటి మార్పులు మరియు తహ్రీఫ్ జరగడం అసాధ్యం. మా వద్ద ఉన్న మరియు నిరంతరం మేము పఠించే ఈ ఖుర్ఆన్ దైవప్రవక్త(స.అ) పై అవతరించిన ఖుర్ఆనే. మరియు ఇలా అని విశ్వసించని వాడు అసత్యుడు, ఇజ్మాను పాడు చేస్తున్నాడు, ప్రజలను దారి తప్పిస్తున్నాడు, లేదా అతడు సందేహానికి గురి అయ్యాడు. ఇలాంటి వ్యాజ్యం చేసేవారు దారితప్పినవారు అయి ఉంటారు, ఎందుకంటే ఖుర్ఆన్ అల్లాహ్ యొక్క ప్రవచనముల సమూహం అందులో ముందు నుంచి గాని లేదా వెనక నుంచి గాని మిథ్యకు చోటు లేదు”[2]
దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించెను: “ఒకవేళ జీవితంలో సౌభాగ్యం మరియు అల్లాహ్ మార్గంలో వీరమరణం పొందాలనుకుంటే, ప్రళయ దీనాన విముక్తి మరియు ఆరోజు ఉండే మండుటెండలో నీడ కావాలనుకుంటే, ఆ భయంకరమైన హడలు పుట్టించే మరియు దిగ్ర్భమకు గురి చేసే ఆ రోజున హిదాయత్ కావాలనుకుంటే, ఖుర్ఆన్ ను పఠించడం నేర్చుకోండి; ఎందుకంటే: అది అల్లాహ్ ప్రస్తావనం, షైతాన్ నుండి రక్ష మరియు ప్రళయదీనాన మన కార్యముల తూకములో శ్రేష్ఠమైనది”.[3]
దైవపప్రవక్త ఇలా కూడా ప్రవచించారు: “మీలో ఖుర్ఆన్ పఠనాన్ని నేర్చుకునే మరియు ఇతరులను నేర్పించే వారే అందరిలో ఉత్తములు”. [4]
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఇలా ప్రవచించెను: “అల్లాహ్ ఖుర్ఆన్ను ఒక ప్రత్యేక కాలనికి గాని లేదా ప్రత్యేకమైన ప్రజల కోసమని గాని నిశ్చయించలేదు. ఖుర్ఆన్, ప్రళయదినం వరకు ప్రతీ కాలంలో కొత్తదిగా మరియు ప్రతీ ఒక్కరికి కొత్తదనాన్ని ఇస్తుంది”.[5]
ఆయతుల్లాహ్ ఖుమైనీ(ర.అ) ఖుర్ఆన్ పట్ల మన కర్తవ్యాన్ని ఇలా సూచించారు: “ఖుర్ఆన్ తప్పకుండా మన జీవితం యొక్క ప్రతీ భాగంలో ఉండాలి”
పవిత్ర ఖుర్ఆన్ యొక్క పేర్లు
సృష్టికర్తా, ప్రభువూ అయిన అల్లాహ్ మానవులందరి హిదాయత్ కోసం ప్రవక్తలను మరియు పవిత్ర గ్రంథాలను అవతరిపజేసాడు. అలా అవతరించబడ్డ ప్రవక్తల నుండి అంతిమ ప్రవక్త హజ్రత్ “ముహమ్మద్”[స.అ] మరియు అంతిమ గ్రంథం “ఖుర్ఆన్”. ఈ ఖుర్ఆన్ ప్రవిత్రత, జ్ఞానం, ప్రత్యేకత మరియు ప్రాముఖ్యత బుద్ధిమంతులకు తెలిసిందే. ఈ ఖుర్ఆన్ భావాన్ని చదివి ప్రభావితులయ్యి ఇస్లాం స్వీకరించిన వారెందరో ఉన్నారు. ఖుర్ఆన్కు, ఖుర్ఆన్ అనే పేరు కాకుండా మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి. ఆ పేర్లు కూడా ఖుర్ఆన్ యొక్క పలు ఆయతులలో గుర్తు చేయబడ్డాయి. ఉదా: “ఫుర్‍ఖాన్”, “నూర్”, “కలాముల్లాహ్”, “జిక్ర్”, “అహ్సనుల్ హదీస్”, “తన్జీల్”, “బయాన్”, “బలాగుల్ ముబీన్”, “మజీద్”, “కితాబ్”, “ముబీన్” మొ॥.
ఈ పేర్ల భావార్థాల పై కొంచెం దృష్ఠి పెట్టి చూసినట్లైతే చాలా విషయాలు తెలుస్తాయి. ప్రతీ పేరు వెనుక కారణాలు ఉన్నాయి. ఉదాహారణకు ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఇలా వివరించారు: “ఖుర్ఆన్ అని ఆకాశం నుండి అవతరించబడ్డ పూర్తి గ్రంథాన్ని అంటారు కాని ఫుర్‍ఖాన్, నిర్వర్తించడం విధి అయిన స్పష్టమైన ఆయత్లు”.[6].
రిఫరెన్స్
1. ఆయతుల్లాహ్ మారెఫత్, ఉలూమె ఖుర్ఆన్, వహీ వివరణ అధ్యాయంలో.
2. షేఖ్ రజా అల్ ముజఫ్ఫర్, అఖాయిదుల్ ఇమామియాహ్.
3. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం92, పేజీ19.
4. హుర్రె ఆములీ, వసాయిలుష్షియా, భాగం4, పేజీ852.
5. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం2, పేజీ 280.
6. సయ్యద్ హాషిమ్ బహ్రానీ, తఫ్సీరె బుర్హాన్, భాగం1, పేజీ269.
వ్యాఖ్యానించండి