ఖుర్ఆన్ పఠనం మరియు దాని పట్ల మన కర్తవ్యం ఏమిటి అన్న విషయం పై కొన్ని ఆయత్ మరియు రివాయతుల వివరణ...
అల్లాహ్ తరపు నుండి అవతరింపబడ్డ అంతిమ గ్రంథం. దానిని అల్లాహ్ తన అంతిమ ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా(స.అ) యొక్క మోజిజా(అద్భుతకృత్యం)గా నిర్ధారించి అవతరింపజేశాడు. అందులో 114 సూరహ్ లు ఉన్నాయి. ప్రతీ సూరహ్ “బిస్మిల్లాహ్”తో మొదలవుతుంది ఒక్క “బరాఅత్” సూరహ్ తప్ప.
ఖుర్ఆన్ యొక్క పూర్తి జ్ఞానం కేవలం దైవప్రవక్త(స.అ) మరియు వారి అహ్లెబైత్(స.అ)లకు మాత్రమే ఉంది. వారికి తప్ప మరెవ్వరికీ ఖుర్ఆన్ యొక్క సంపూర్ణ జ్ఞానం లేదు.
ఉజూ లేకుండా ఖుర్ఆన్ యొక్క అక్షరాలను తాకడం నిషిద్ధం(హరామ్). ఖుర్ఆన్ కరీమ్ లో నాలుగు ఆయతలు ఉన్నాయి అవి పఠించడం లేదా వినటం ద్వార వెంటనే సజ్దా చేయటం వాజిబ్ అవుతుంది. ఆ నాలుగు ఆయతులు 12వ, 24వ, 27వ మరియు 30వ పారహ్ లలో ఉన్నాయి.
ఇది చాలా గొప్ప గ్రంథం, ఈనాటి వరకు ప్రజలందరూ కలిసి దానికి జవాబు తీసుకొని రాలేకపోయారు మరియు అంతిమ దినం వరకు కూడా తీసుకొని రాలేరు.[1].
ఖుర్ఆన్ పఠన ప్రాముఖ్యత
అల్లాహ్ ప్రవచనాల పట్ల ప్రేమా మరియు ఇష్టం కలిగి ఉండటంలో చాలా లాభాలు ఉన్నాయి అని ఖుర్ఆన్ మరియు హదీసులలో సూచించబడి ఉంది. వాటి నుండి కొన్నింటిని ఇక్కడ వివరిస్తున్నాము:
1. విశ్వాసంలో పటిష్టత: “నిజమైన విశ్వాసులు ఎటువంటి వారంటే - అల్లాహ్ ప్రస్తావన రాగానే వారి హృదయాలు భయంతో వణుకుతాయి. అల్లాహ్ ఆయతులు వారి ముందు పఠించబడినపుడు, అవి వారి విశ్వాసాన్ని మరింత వృద్ధిచేస్తాయి...,”[సూరయె అన్ఫాల్, ఆయత్2]
2. జీవితంలో వెలుగుకు కారణం: దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “మీ ఇళ్ళలో ఖుర్ఆన్ తిలావత్ ద్వార వెలుగు తీసుకొని రండి, మీ ఇళ్ళను స్మశానంగా మార్చకండి...”[2]
3. అంతర్ దృష్టి మరియు ఆగాహీ: "విశ్వసించేవారికి దివ్య ఖుర్ఆన్ లో మీ ప్రభువు తరపు నుంచి ఎన్నో నిదర్శనాలున్నాయి. ఇది మార్గదర్శకత్వం మరియు కారుణ్యం...,"[సూరయె ఆరాఫ్, ఆయత్203.]
దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించెను: “ఒకవేళ జీవితంలో సౌభాగ్యం మరియు అల్లాహ్ మార్గంలో వీరమరణం పొందాలనుకుంటే, ప్రళయ దీనాన విముక్తి మరియు ఆరోజు ఉండే మండుటెండలో నీడ కావాలనుకుంటే, ఆ భయంకరమైన హడలు పుట్టించే మరియు దిగ్ర్భమకు గురి చేసే ఆ రోజున హిదాయత్ కావాలనుకుంటే, ఖుర్ఆన్ ను పఠించడం నేర్చుకోండి; ఎందుకంటే: అది అల్లాహ్ ప్రస్తావనం, షైతాన్ నుండి రక్ష మరియు ప్రళయదీనాన మన కార్యముల తూకములో శ్రేష్ఠమైనది”.[3]
ఖుర్ఆన్ పట్ల మన కర్తవ్యం
ఒక ముస్లిం అయి ఉండి ఖుర్ఆన్ ఉపదేశాలు తెలియకపోవడం సరికాదు. ఇస్లాం ఆచరణలో ఉండి, ఇస్లాంను విశ్వసించి అల్లాహ్ ఉపదేశాలు తెలియకపోవడం మంచి విషయం కాదు, సిగ్గుచేటు. అల్లాహ్ దాసుడై ఉండి దైవప్రవక్త(స.అ) పట్ల ఇష్టం లేకపోవడం చాలా ఆశ్చర్యకరమైన మరియు నమ్మదగిన విషయం కాదు. అల్లాహ్ను ఇష్టపడతామని చెప్పడం మరియు ఆయన ఉపదేశాలను చదవకపోవడం మరియు వాటిని అర్ధం చేసుకోకపోవడం, అంగీకృతమైనది కాదు. ఈ విధంగా చూసినట్లైతే, ఖుర్ఆన్ పట్ల ఒక ముస్లిము యొక్క కర్తవ్యం ఏమిటంటే అల్లాహ్ తరపు నుండి దైవప్రవక్త(స.అ) పై అవతరించబడ్డ ఈ పవిత్ర గ్రంథాన్ని ముందుగా సరిగా పఠించడం నేర్చుకోవాలి. ఆ తరువాత వాటిలో ఉన్న ఆయత్ల అర్ధాలను, వాటి భావాలను తెలుసుకోవాలి. మూడవ స్థితిలో ఖుర్ఆన్ ఉపదేశాల పై అమలు చేయాలి, ఆ అమలు కూడా నిష్కకపటమైనది అయి ఉండాలి. తన జీవితంలో ఖుర్ఆన్ యొక్క చట్టాన్ని మరియు దాని ఉపదేశాలను జారీ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండాలి. ముస్లిమే కాకుండా వేరే ఎవరైనా సరే ఖుర్ఆన్ చదవడం మొదలు పెడితే, కొంత కాలంలోనే వారు సౌభాగ్యం మరియు సంతోషాన్ని పొందుతారు, అలా అని వారు గ్రహిస్తారు కూడాను. చాలా మంది ప్రముఖులు ముస్లిముల కాకపోయిన ఖుర్ఆన్ భావాన్ని పఠిస్తారని మేము టీవీలలో, న్యూస్ లలో చూస్తూ ఉంటాము. మీరు కూడా ఒకసారి ఖుర్ఆన్ ను చదివి అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించండి, తప్పకుండా ఫలితం దక్కుతుంది.
ఖుర్ఆన్ ను పఠించి ఇస్లాం ను అర్ధం చేసుకోండి, ఇహపరలోకాలలో సంపూర్ణత్వాన్ని పొందండి.
రిఫరెన్స్
1. ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే దువ్వుమ్
2. కులైనీ, మొహమ్మద్ ఇబ్నె యాఖూబ్, భాగం2, పేజీ610.
3. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం92, పేజీ19.
వ్యాఖ్యానించండి