ఇమామ్(అ.స) అదృశ్యకాలం యొక్క రకాలు మరియు ఆ కాలంలో వారి ప్రతినిధులు మరియు వారి ప్రత్యక్షమైన తరువాత వారి సహచరుల లక్షణాల వివరణ సంక్షిప్తంగా...

గైబతె ఇమామ్(అ.స) అనగా ఇమామ్ మనకు కనిపించకుండా అదృశ్యంగా ఉండడం. ఇమామ్ అదృశ్యంగా ఉన్నారు అన్న విషయం చాలా ముఖ్యమైన విషయం. అల్లాహ్ ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారు ప్రత్యక్షమవుతారు. వారు వచ్చి అన్యాయం మరియు దుర్మార్గంతో నిండి ఉన్న ఈ ప్రపంచాన్ని న్యాయధర్మాలతో నింపేస్తారు. ఇలా అని కేవలం షియా వర్గం కాదు ప్రతీ మతం, వర్గం వారు నమ్ముతారు.
ప్రపంచాన్ని న్యాయధర్మాలతో నింపే ఆ వ్యక్తి ఎవరు?, జన్మించారా లేదా? అన్న విషయాలను ఒక హదీస్ ద్వారా తెలుసుకుందా. “ముహమ్మద్ ఇబ్నె ఉస్మానె అమ్రీ”, ఇతను ఇమామ్(అ.స) యొక్క ప్రతినిధులలో ఒకరు. ఇతను ఇలా అన్నారు: నేన నా తండి నుండి ఇలా విన్నాను; ఇమామ్ హసన్ అస్కరీ[అ.స] వద్ద ఉన్నప్పుడు నా తండ్రి గారు ఇలా ప్రశ్నించారు: “దైవప్రవక్త(స.అ) యొక్క “ఎవరైతే తన కాలం యొక్క ఇమామ్ గురించి తెలుసుకోకుండా మరణిస్తాడో వాడి మరణం అజ్ఞానపు మరణం” అన్న ఈ మాట సత్యమేనా? ఇమామ్(అ.స): అవును ఈ మాట సరైనదే ఇందులో ఎటువంటి సందేహమూ లేదు ఎలాగైతే ఇప్పుడు పగలు అన్న విషయంలో సందేహములేదో” ఆ తరువాత నా తండ్రి గారు ఇలా అన్నారు: అయితే మీ తరువాత ఇమామ్ ఎవరు?. ఇమామ్ హసన్ అస్కరీ(అ.స) హజ్రత్ ఇమామ్ మహ్దీ(అ.స) పేరును సూచించారు. ఆ తరువాత ఇలా అన్నారు: “అతను సుదీర్ఘకాలం వరకు అదృశ్యంగా ఉంటారు, ఆ వ్యవధిలో, ఆ కాలంలో కొందరు కలవరం చెందుతారు, కొందరు గతించిపోతారు మరికొందరు సందేహానికి గురి అవుతారు”
ఈ రివయత్ ద్వారా తెలిసే విషయం ఏమిటంటే ప్రపంచాన్ని న్యాయధర్మాలతో నింపడానికి వచ్చే ఆ మహావ్యక్తి హిజ్రీ యొక్క 3వ శతాబ్ధములోనే జన్మించాడు. అనగా 14 శతాబ్దముల క్రితం.[1]
ఇమామ్(అ.స) అదృశ్యకాలంలో వారి ప్రతినిధులు
ఇమామ్(అ.స) మనకు కనిపించకుండా అదృశ్యంగా ఉన్న కాలాన్ని రెండుగా విభజించడం జరిగింది: 1. గైబతే సుగ్రా 2. గైబతే కుబ్రా.
గైబతే సుగ్రా కాలం అనగా ఆ రోజుల్లో ఇమామ్(అ.స) మరియు ప్రజల మధ్య ఇమామ్ తరపు నుండి నియమించబడ్డ ప్రతినిధులు ఉండేవారు. వాళ్ళు ఇమామ్(అ.స) మరియు ప్రజల మధ్యస్థులుగా ఉండేవారు. వాళ్ళు ఇమామ్(అ.స)ను కలిసే వారు. ఇమామ్ వారికి తప్ప మరెవ్వరికీ కనబడేవారు కాదు. కొంతకాలం తరువాత “గైబతే కుబ్రా” కాలం మొదలయ్యింది. గైబతే కుబ్రా కాలంలో ఇక ఇమామ్ ఎవ్వరికి కనబడకుండా అదృశ్యమయ్యారు. ఇమామ్(అ.స) మరలా అల్లాహ్ ఆజ్ఞతో ప్రత్యేక్షమయ్యే వరకు “గైబతే కుబ్రా” కాలం సాగుతూనే ఉంటుంది. ఇప్పుడు మేము “గైబతే కుబ్రా” కాలంలో ఉన్నాము.
ఆ “గైబతే సుగ్రా” కాలంలో ఉన్న ఇమామ్(అ.స) ప్రతినిధుల నలుగురు. వారిని “నవ్వాబె అర్బఅహ్” అంటారు. వారి పేర్లు:
1. అబూ అమ్ర్ ఉస్మాన్ ఇబ్నె సయీదె అమ్రీ
2. అబూజాఫర్ ముహమ్మద్ ఇబ్నె ఉస్మాన్ ఇబ్నె సయీదె అమ్రీ
3. అబుల్ ఖాసిమ్ హుసైన్ ఇబ్నె రౌ(రూ)హె నౌబఖ్తీ
4. అబుల్ హసన్ అలీ ఇబ్నె ముహమ్మదె సమరీ[2].
ఇమామె ౙమాన్(అ.స) సహాబీయుల ప్రత్యేకతలు
రివాయతుల ప్రకారం ఇమామె ౙమాన్(అ.స) సహాబీయుల యొక్క కొన్ని ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి:
1. స్వచ్ఛత: ఇమామ్ జవాద్(అ.స) అబ్దుల్ అజీమె హసనీ(అ.స)తో ఇలా అన్నారు: “...స్వచ్ఛమైన వ్యక్తులు సంఖ్య 313కు చేరగానే అల్లాహ్ తన ఆజ్ఞను వ్యక్తం చేస్తాడు”
2. గట్టినమ్మకం మరియు స్థిరత్వం: ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: “.... వారి హృదయాలు ఇనుము ముక్కల లాంటివి, వారి హృదయాలలో అల్లాహ్ పట్ల ఎటువంటి సందేహమూ లేదు. రాళ్ల కన్నా బలమైనది...”
3. అల్లాహ్ ను అర్ధం చేసుకున్న నిజమైన విశ్వాసులు: ఇమామ్ అలీ(అ.స) ఉల్లేఖనం: “.... విశ్వాసులు వస్తారు, వారు అల్లాహ్ ను సరైన పద్ధతిలో అర్ధం చేసుకొని ఉంటారు, వారే చివరి కాలంలో ఇమామె ౙమాన్(అ.స) యొక్క సహాయకులై ఉంటారు”
4. పగల పులులు రాత్రి యోగులు: “ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: “నేను ఖాయమ్ మరియు వారి సహాబీయులను నజఫ్ కూఫాలలో ఇలా చూస్తూన్నట్లుంది... వారి నొసలపై సజ్దాల నిషానీలు ఉన్నాయి, పగటిపూట పులులులా మరియు రాత్రుళ్లు యోగులు...”
5. అల్లాహ్ సమ్మతి కలిగి ఉన్నవారు: తబర్సీ ఇమామ్ అలీ(అ.స) నుండి రివాయత్ ను ఇలా ఉల్లేఖించారు: “.... అల్లాహ్ చివరి కాలంలో ఒకరిని ఎన్నుకునేంత వరకు... వారిని దైవదూతలు సమ్మతిస్తారు వారి సహాయకులను రక్షణ కలిపిస్తారు”[3]
రిఫరెన్స్
1. షేఖ్ సదూఖ్, కమాలుద్దీన్, భాగం2, పేజీ81.
2. సయ్యద్ మొహ్సిన్ అమీన్, ఆయానుష్షియా, భాగం2, పేజీ48.
3. అలీ అస్గర్ రిజ్వానీ, మౌఊద్ షినాసి వ పాసుఖ్ బె షుబ్హాత్, పేజీ599, ఇంతెషారాతె మస్జిదె జమ్కరాన్, 1384.
వ్యాఖ్యానించండి