పశ్చాత్తాపం గురించి ఖుర్ఆన్ మరియు హదీస్ లు ఏమని వివరిస్తున్నాయి అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

ఈ లోకంలో పాపములలో మునిగి, అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందిన పాపాత్ములను సంభోదిస్తూ అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు: (ఓ ప్రవక్తా! నా తరఫున వారికి ఇలా) చెప్పు: "తమ ఆత్మలపై అన్యాయానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా! మీరు అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. నిజంగా ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు[సూరయె జుమర్, ఆయత్53].
తౌబహ్ అనగా "పాపములను వదిలి రుజుమార్గం వైపు రావటం" మరియు ఈ పాపముల నుండి విముక్తి కేవలం ప్రాయశ్చితం మరియు అల్లాహ్ క్షమాపణ ద్వారానే సాధ్యమవుతుంది, ఈ లోకంలో ఆ సర్వలోకేశ్వరుడైన అల్లాహ్ తప్ప మరెవరు మన పాపాలను క్షమించగలుగుతారు, పవిత్ర ఖుర్ఆన్ ఈ విధంగా సెలవిస్తున్నది: “ఆయనే తన దాసుల పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడు, వారి తప్పులను మన్నిస్తాడు. మీరు చేసేదంతా ఆయనకు తెలుసు” [సూరయె షూరా, ఆయత్25].
కేవలం పశ్చాత్తాపం, క్షమాపణ మరియు మంచి కార్యాలు చేయటమే కాకుండా సన్మార్గంపై స్థిరంగా ఉండటం కూడా చాలా అవసరం, అలా చేసినవారికే అల్లాహ్ క్షమిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు: “అయితే పశ్చాత్తాపం చెంది, విశ్వసించి, సత్కార్యాలు చేసి, ఆపై సన్మార్గంపై స్థిరంగా ఉన్న వారిని నేను అమితంగా క్షమిస్తాను”[సూరయె తాహా, ఆయత్82].
దైవప్రవక్త(స.అ) ఈ విధంగా ఉల్లేఖించారు: "తన పాపములపై ప్రాయశ్చితుడైనవాడు ఎటువంటి పాపము చేయని వాడితో సమానం"[1]
తౌబా(ప్రాయశ్చితం) యొక్క అర్ధాన్ని వివరిస్తూ ఇమామ్ అలి(అ.స) ఈ విధంగా సెలవిచ్చారు: తౌబా అనగా చేసిన పాపానికి తన మనస్సులో పశ్చాత్తాపం చెందటం, తన నోటితో(ఆ అల్లాహ్ సన్నిధానా) క్షమాపణ కోరటం, ఆ పాపాన్ని వదిలి వేయటం, తిరిగి మరల ఆ పాపాం జోలికి పోనని గట్టిగా తనలో తాను నిర్ణయించుకోవటం".[2]
ఇమామ్ సాదిఖ్(అ.స) ఈ విధంగా సెలవిచ్చారు: "ప్రతీ నొప్పికి ఒక ఔషధం ఉంటుంది అలాగే పాపముల యొక్క ఔషధం(ఆ అల్లాహ్ సమక్షంలో) క్షమాపణ మరియు శరణువేడటం".[3]
ఫుజైల్ పశ్చాత్తాపం
"ఫుజైల్ బిన్ అయాజ్" తన కాలపు ఒక ప్రసిధ్ధ దోపిడీ దొంగ. అతడి పేరు వింటే చాలు ప్రజలు భయభ్రాంతులకు గురి అయ్యేవారు. ఒకరోజు అయాజ్ ఓ దొంగతనం నిమిత్తం ఒక గోడ ఎక్కినప్పుడు ఇంట్లో ఉన్న వ్యక్తిని ఖుర్ఆన్ యొక్క ఈ ఆయతును పఠిస్తుండగా విన్నాడు “ఏమిటీ విశ్వాసుల హృదయాలు అల్లాహ్ జ్ఞాపకం పట్ల, ఆయన అవతరింపజేసిన సత్యం పట్ల మెత్తబడే సమయం ఇంకా వారికి ఆసన్నం కాలేదా?”[సూరయె హదీద్, ఆయత్16]. ఆయతు విన్న వెంటనే అయాజ్ లో ఒక రకమైన మార్పు సంతరించుకొని “ప్రభువా ఆ సమయం ఆసన్నమైంది” అని అరిచాడు. ఫుజైల్ ఆ భగవంతుని సన్నిధిలో తన పాపాల పట్ల పశ్చాత్తాప్పడి మరలా ఆ నాటి నుండి పాపాల జోలికి పోలేదు. చరిత్ర ఫుజైల్ ను ఇమామ్ సాదిఖ్(అ.స) వద్ద విధ్యాభ్యాసం చేసిన వారిలో ఒకరిగా మరియు వారి నుండి హదీసులను ఉల్లేఖించేవారిగా పరిగణిస్తుంది. ఇదంతా ఒక నిజమైన పశ్చాత్తాపం వలనే.[4]
ఫుజైల్ వలె మనకు కూడా దేవుని వైపు తరలి పోవటానికి సమయం ఇంకా ఆసన్నం కాలేదా? ఆలోచించండి!!!
ఇమామ్ అలీ(అ.స) ఒక హదీసులో ఈ విధంగా సెలవిస్తున్నారు: “ఎటువంటి చర్య(ఆచరణ) లేకుండా పరలోకం గురించి ఆశించే వారి వలె ఉండకు మరియు (వారు) దీర్ఘకాలిక ఆకాంక్షలతో పశ్చాత్తాపాన్ని ఆలస్యం చేస్తారు”.[5]
నిధిని పొందాలనుకునే వాడికి కష్టపడటం తప్పదు. పరలోకం, స్వర్గం మరియు ఆ దేవుని ప్రతిఫలాన్ని ఆశించేవానికి తన లక్ష్యాలను సాధించటానికి కష్టపడటం కూడా అవసరం. ఒక తోటమాలి లేదా ఒక రైతుకు దుక్కటం, దున్నటం, నీటిని అందించటం మరియు దానిని(పంటను) కాపాడకోవడం అన్నీ చేయాలి, అవి చెయకుండా పంట చేతికి రాదు కదా? అలాగే నమాజ్, రోజా, పాపాలను విడిచిపెట్టడం మరియు షైతాన్ ను విడిచి ఆ అల్లాహ్ యొక్క మార్గంలో జీవించడం లాంటివి చేయకుండా స్వర్గాన్ని పొందాలనుకోవటం కూడా మూర్ఖత్వమే. పాపము ఒక ఉచ్చు లాంటిది దానిలో చిక్కుకున్న వాడు అల్లాహ్ శిక్ష నుండి తప్పించుకోలేడు. అలా చిక్కుకున్నవాడికి కేవలం పశ్చత్తాపం ఒకటే చికిత్స. పాపము ఒక ప్రాణాంతక వ్యాధిలాంటిది దానిని పశ్చాత్తాపంతో చికిత్స చేయకుంటే అది మానవుడ్ని తప్పక నాశనం చేస్తుంది. అందుకే ఎంత తొందరగా తమ పాపాలకు పశ్చాత్తాపాన్ని గురై ఆ దేవుని సన్నిధిలో క్షమాపణను కోరుకుంటే అంత మంచిది.
అల్లాహ్ మనందరికి తౌబాహ్ చేసే అర్హత కలిపించుగాక...
రిఫరెన్స్
1. అబ్దుల్ ఖాదిర్ బిన్ బద్రాన్, అష్-షహాబు ఫిల్ హికమి వల్ ఆదబ్, పేజీ18.
2. తమీమీ ఆమెదీ, అబ్దుల్ వాహిద్, గురరుల్ హికం, పేజీ39.
3. షేఖ్ సదూద్, సవాబుల్ ఆమాల్, పేజీ365.
4. ఇబ్నె ఖలకాన్, వఫయాతులు ఆయాన్, భాగం4, పేజీ47.
5. జవాద్ ముహద్దసి, హిక్మత్ హాయె అలవి వ తౌజీహె చెహెల్ హదీస్ అజ్ ఇమామ్ అలీ(అ.స).
వ్యాఖ్యానించండి