ఆరాధన విధానం మనిషి యొక్క బుద్ధివివేకాలకు నిదర్శనం అని నిరూపించిన జనాబె సల్మాన్ ఆరాధన పద్ధతి.
జనాబె సల్మాన్ చేసే ఆరాధనలు కూడా వారి జ్ఞానానికి నిదర్శనం. ఎందుకంటే జ్ఞానంతో కలిసి ఉన్న ఆరాధన అంతర్ దృష్టితో కూడి ఉంటుంది. దీనిని నిదర్శనించే ఒక సంఘటన హదీస్ రూపంలో:
ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఉల్లేఖనం: ఒకరోజు దైవప్రవక్త[స.అ] సహచరులతో ఇలా అన్నారు: మీలో ఎవరు అన్ని రోజులు ఉపవాసం ఉంటారు?
సల్మాన్: నేను ప్రవక్తా!
దైవప్రవక్త[స.అ]: మీలో ఎవరు రాత్రళ్ళు ప్రార్థనలో గడుపుతారు?
సల్మాన్: నేను ప్రవక్తా!
దైవప్రవక్త[స.అ]: మీలో రోజుకి ఒకసారి పూర్తి ఖుర్ఆన్ ను చదివేవారెవరైనా ఉన్నారా?
సల్మాన్: నేను ప్రవక్తా!
అక్కడున్నవారిలో ఒకడు సల్మాన్ సమాధానాలను స్వోత్కర్ష(తనను తాను పొగుడుకోవడం)గా భావించి ఇలా అన్నాడు: ఎన్నో సార్లు ఉదయం పూట ఉపవాసం లేకుండా సల్మాన్ ను చూశాను, రాత్రుళ్ళు నిద్రపోవడం మరియు పగలు మౌనంగా ఉండడం కూడా చూశాను, మరి ఎలా నిరంతరం ఉపవాసం, రాత్రంతా ప్రార్థన మరియు ప్రతీరోజు ఒకసారి ఖుర్ఆన్ పూర్తిగా చదివేవారు!?.
అప్పుడు దైవప్రవక్త[స.అ] ఇలా అన్నారు: మౌనంగా ఉండు! నీకు లుఖ్మాన్ తో సమానమైనవారితో ఏం పని?. ఎలా సాధ్యం అని తెలుసుకోవాలనుంటే స్వయంగా అతనినే అడిగి తెలుసుకో.
సల్మాన్ ఇలా వివరించారు: నేను నెలలో మూడు రోజులు ఉపవాసం ఉంటాను, మరి అల్లాహ్ ఇలా ఉపదేశిస్తున్నాడు: “ఎవరైతే ఒక మంచి పని చేస్తారో దానికి నేను పది రెట్లు పుణ్యాన్ని ప్రసాదిస్తాను” అలాగే షాబాన్ మాసం యొక్క చివరి రోజున ఉపవాసం చేసి దానిని రమజాన్ మాసం యొక్క ఉపవాసాలతో కలిపేస్తాను, ఇలా చేసిన వారికి నిరంతరం ఉపవాసం ఉన్న వారి పుణ్యం లభిస్తుంది. దైవప్రవక్త[స.అ]ను ఇలా చెబుతుండగా విన్నాను: “శుద్ధి(ఉజూ)తో పడుకుంటే రాత్రంతా ప్రార్థనలో గడిపిన వారి పుణ్యం లభిస్తుంది” ఇక మిగిలింది ఖుర్ఆన్ చదవడం, దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించారు: “ఎవరైతే ‘ఖుల్ హువల్లాహ్’ సూరహ్ ను చదువుతారో వారికి 1/3 వంతు ఖుర్ఆన్ చదివిన పుణ్యం లభిస్తుంది, అలాగే ఎవరైతే రెండు సార్లు చదువుతారో 2/3 వంతు ఖుర్ఆన్ చదివినట్లు మరి ఎవరైతే మూడు సార్లు చదువుతారో వారు పూర్తి ఖుర్ఆన్ చదివినట్లే”[బిహారుల్ అన్వార్, భాగం22, పేజీ317].
రిఫ్రెన్స్
అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్.
వ్యాఖ్యానించండి