షాబాన్ మాసం యొక్క చివరి రోజుల గురించి పవిత్ర మాసూముల ఉల్లేఖనలు...

షాబాన్ మాసం ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం 8వ మాసం. ఇది చాలా ప్రాముఖ్యత గల మాసం. షాబాన్ మాసం దైవప్రవక్త(స.అ)తో ప్రత్యేకించబడినది. అందుకు వారు షాబాన్ మాసపు ప్రత్యేకతలను ప్రస్థావిస్తున్న హదీసులే సాక్ష్యం. వారు ఈ మాసంలో ఉపవాసముండి వాటిని రమజాను మాసపు ఉపవాసాలతో కలిపేవారు. ఒక చోట దాని ప్రత్యేకతలను ప్రస్థావిస్తూ ఈ విధంగా సెలవిచ్చారు: “షాబాన్ నా మాసము ఎవరైతే ఈ మాసంలో ఉపవాసముంటారో నేను ప్రళయ దినాన(ఆ అల్లాహ్ సన్నిధిలో) వారి సిఫార్సు చేస్తాను”[1]. ఇమామ్ అలీ(అ.స) కూడా షాబాన్ మాసం యొక్క ప్రాముఖ్యతను ప్రస్థావిస్తూ ఈ విధంగా సెలవిచ్చారు: “రమజాను మాసము అల్లాహ్ యొక్క మాసము, షాబాన్ మాసము దైవప్రవక్త(స.అ) మాసము మరియు రజబ్ నా మాసము”[2]. ఇమామ్ రిజా(అ.స) ఈ విధంగా సెలవిస్తున్నారు: “ఓ భగవంతుడా! ఒక వేళ నువ్వు ఈ గడిచిన షాబాన్ మాసపు రోజులలో (మా పాపాలను) క్షమించనట్లైతే వాటిని (ఈ షాబాన్ మాసపు) చివరి రోజులలోనైన క్షమించు (ఈ దుఆ ను షాబాను మాసపు చివరి రోజులలో చేయమని చాల సిఫార్సు చేయబడి ఉంది)”.[3]. ఇమామ్ అలీ(అ.స) షాబాన్ మాసపు ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను ప్రస్థావిస్తూ ఈ విధంగా ప్రవచించారు: షాబాన్ మాసము యొక్క ఉపవాసము హృదయాలలో గల దురాలోచనలను మరియు శరీరానికి గల కష్టాలను దూరం చేస్తుంది[4].
షాబాన్ చివరి రోజులు
షాబాన్ మాసము తన కృప మరియు కారుణ్యంతో మనల్ని వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. ఈ మాసాన్ని ఆ అల్లాహ్ దయ మరియు ఆయన సామిప్యాన్ని పొందటానికి ఏ మాత్రం కృషి చేశాము? అని మనల్ని మనము ప్రశ్నించుకునే అవసరముంది. ఒక వేళ మనము ఆ కృపాశీలుడైన అల్లాహ్ దయను ఆయన సామిప్యాన్ని పొందలేకపోయామా? లేదా ఈ మాసాన్ని ఏ విధంగా అయితే అల్లాహ్ యొక్క నిజమైన దాసులు ఆదరిస్తారో ఆ విధంగా ఆదరించలేకపోయామా? అని అనుకుంటే ఈ మాసం యొక్క చివరి రోజులు మనకు మరొక అవకాశాన్ని ఇస్తున్నాయి. ఈ పూర్తి మాసంలో చేయలేకపోయిన పుణ్యకార్యాలను చేయటానికి మరియు ఆ దేవుని సన్నిధిలో ప్రాయశ్చితాన్ని ఈ షాబాన్ యొక్క చివరి రోజులలో పొందటానికి కృషిచేయగలము. ముఖ్యంగా ఈ మాసపు చివరి మూడు రోజులలో ప్రార్ధనలతో పాటు ఉపవాసముండమని చాలా హదీసులలో తాకీదు చేయటం జరిగింది. ఇమామ్ సాదిఖ్(అ.స) ఒక హదీసులో ఈ విధంగా సెలవిస్తున్నారు: “ఎవరైతే షాబాన్ మాసం యొక్క చివరి మూడు రోజులు ఉపవాసముండి వాటిని రమజాన్ మాసంతో కలుపుతారో, ఆ భగవంతుడు అతనికి ఒకదాని తరువాత ఒకటి రెండు మాసాల ఉపవాస దీక్ష నిర్వర్తన పుణ్యాన్ని అతని కార్యాముల చిట్టాలో లిఖిస్తాడు”.[5]
ఇమామ్ రిజా(అ.స) అనుచరుడైన అబా సల్త్ ఈ విధంగా ఉల్లేఖిస్తున్నారు: నేను ఇమామ్ రిజా(అ.స) వద్దకు వెళ్ళినప్పుడు వారు నాతో ఈ విధంగా సెలవిచ్చారు: షాబాన్ మాసము చాలా వరకూ గడిచిపోయింది. ఈ మాసములో చేయవలసిన కార్యాలలో వచ్చిన లోటును మిగిలిన రోజులలో పూర్తి చేయండి. ఏదైతే మీ కొరకు లాభదాయకమో మరియు ఏది మీ కొరకు లాభదాయకం కాదో అది మీ చేతులలో ఉంది. ఇప్పుడు ఈ మాసంలో ఎక్కువగా ప్రార్ధన, ప్రాయశ్చితం మరియు ఖుర్ఆన్ పఠనం వంటివి చేయండి. పాపాలను మరియు ఆ అల్లాహ్ పట్ల అవిధేయతను చూపటాన్ని వదిలి ఆ అల్లాహ్ వైపుకు మరలి రండి. ఆ దేవుని నుండి మీ పాపాలకు ప్రాయశ్చితాన్ని కోరుకోండి తద్వారా అల్లాహ్ మాసము[రమజాన్] మొదలైనప్పుడు మీరు నిష్టమైన దాసుల వలే ఆ మాసములోకి ప్రవేశించగలరు. మరియు షాబాన్ మాసపు మిగిలిన రోజులలో ఈ విధంగా ఆ దేవునిని వేడుకుంటూ ఉండు: “అల్లాహుమ్మ ఇన్ లం తకున్ గఫర్త లనా ఫీ మా మజా మిన్ షాబాన ఫగ్ఫిర్ లనా ఫీమా బఖియ మిన్ హు”.[6]
రిఫరెన్స్
1. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం84, పేజీ93.
2. కులైనీ, మొహమ్మద్ ఇబ్నె యాఖూబ్, షర్హె ఫురూయె కాఫీ, భాగం4, పేజీ14.
3. హుర్రె ఆములీ, వసాయెలుష్ షీయా, భాగం10, పేజీ301.
4. ఇబ్నె షుఅబె హర్రానీ, తొహ్ఫుల్ ఉఖూల్, పేజీ102.
5. హుర్రె ఆములీ, వసాయెలుష్ షీయా, భాగం7, పేజీ375, హదీస్22.
6. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం94, పేజీ73.
వ్యాఖ్యలు
Jazakallah
వ్యాఖ్యానించండి