దైవప్రవక్త(స.అ) యొక్క నిజమైన ఉత్తరాధికారి అయిన హజ్రత్ అలీ(అ.స) జీవిత చరిత్ర సంక్షిప్తంగా
అంతిమ దైవప్రవక్త హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా(స.అ) యొక్క దౌత్య ఎన్నికకు 10 సంవత్సరాల ముందు అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) మక్కాలో ఉన్న అల్లాహ్ గృహం, కాబాలో జన్మించారు. దైవప్రవక్త(స.అ) మరణానంతరం వారు 30 సంవత్సరాలు జీవించారు. వారు 63 ఏళ్ల వయసులో అన్యాయంగా చంపబడ్డారు.
మనిషి యొక్క వ్యక్తిత్వ నిర్మాణం, ఆత్మ శిక్షణకు అత్యుత్తమకాలం, అతడి మొదటి దశ. ఆ మొదటి దశలో హజ్రత్ అలీ(అ.స) దైవప్రవక్త(స.అ) శిక్షణలో పెరిగారు.
హజ్రత్ ముహమ్మద్(స.అ)ను అల్లాహ్ తన ప్రవక్తగా ఎన్నుకున్నప్పుడు, హజ్రత్ అలీ(అ.స) దైవప్రవక్త(స.అ) ప్రక్కనే ఉన్నారు.
హజ్రత్ అలీ(అ.స) బెఅసత్ నుండి మదీనహ్‌కు వలసి వెళ్లక ముందు గడిచిన 13 సంవత్సరాల కాలంలో ఇస్లాం యొక్క అభివృద్ధి కోసం వారు ఎన్నో సేవలు అందించారు, కృషి చేశారు, గొప్ప గొప్ప చర్యలు చేపట్టారు. ఇలాంటి చర్యలు ఇస్లాం చరిత్రలో వారికి తప్ప మరొకరికి సొంతం కాలేదు.
భహిరంగంగా ఇస్లాం స్వీకరించిన మొట్టమొదటి వ్యక్తి వీరే, వీరు పుట్టినప్పటి నుంచే ఏకేశ్వరవాది, ఒక్క క్షణం కూడా విగ్రాహారాధన చేయలేదు.
బహిరంగంగా ప్రజలను ఇస్లాం వైపు ఆహ్వానించే చర్యలో దైవప్రవక్త(స.అ) తనకు ఎవరు సహాయం చేస్తారో వారే తన తరువాత తన ఉత్తరాధికారి అని ప్రకటించారు, అప్పుడు కూడా హజ్రత్ అలీ(అ.స) తప్ప మరెవరూ ముందుకు రాలేదు.
మక్కా కపటవర్తనులు దైవప్రవక్త(స.అ)ను చంపాలని పన్నాగం పన్నారు. అప్పుడు వారి పాన్పు పై హజ్రత్ అలీ(స.అ) పడుకొని దైవప్రవక్త(స.అ) ప్రాణాలను కాపాడారు. ఇది వారి గొప్ప త్యాగానికి నిదర్శనం.
ఇస్లాం రక్షణ కోసం ఎన్నో యుద్ధాలలో వారు తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా చేసిన యుద్ధాలు ఇస్లాం పట్ల వారికి ఉన్న గౌరవానికి నిదర్శనం.
వారితో యుద్ధానికి ఎంత పెద్ద వీరుడు దిగినా వాడిని మట్టి కరిపించేవారు. చరిత్ర ఇలాంటి సంఘటనలతో నిండి ఉంది.
ఖిలాఫత్ అధికారానికి దూరంగా ఉన్న కాలంలో హజ్రత్ అలీ(అ.స) తన వ్యక్తిగత జీవితం మరియు పేదవారిని ఆదుకోవడం కోసం వ్యవసాయం చేసేవారు మరియు ఖర్జూరపు తోటలు చూసుకునేవారు. వారు దానధర్మాలు చేసేవారు. వారు భూములను ప్రజలందరికి అందుబాటులో ఉండే విధంగా వఖ్ఫ్(అంకితం) చేసేవారు. ఈ క్రమంలో వారు మదీనహ్ చుట్టుప్రక్కల్లో ఉన్న భూములను వ్యవసాయ భూములు మరియు తోటలుగా మార్చేశారు. ఇది యుద్ధ వ్యర్థాలు మరియు నివాళి రూపంలో దైవప్రవక్త(స.అ) ద్వార అలీ(అ.స)కు ఇవ్వబడిన భూములు. వారు అక్కడ బావులు త్రవ్వి వాటి ద్వార అక్కడ తోటలను పెంచారు. ఖిలాఫత్ కాలంలో అది వారి ఆధ్వర్యంలోనే ఉండేవి వాటి ద్వార వచ్చే సొమ్ముతో తమ జీవితాన్ని గడిపేవారు. దాని ఆదాయంతో పేదవారికి, ఆనాధ పిల్లలకు మరియు విధవరాలకు సహాయం చేసేవారు వారి కడుపును నింపేవారు, మరి వారు మాత్రం చాలా సాధరణ ఆహారంతో సరిపెట్టుకునే వారు.
వారు చేసిన విజ్ఞాన పరమైన కార్యక్రమాలను చూసుకున్నట్లైతే వారు ఖుర్ఆన్ ను సేకరించారు, గొప్ప గొప్ప శిష్యులకు శిక్షణ ఇచ్చారు, యూధుల మరియు క్రైస్తవుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేవారు, రాజకీయ సమస్యలలో ఖలీఫాలకు సలహాలు ఇచ్చేవారు.
హజ్రత్ ఉస్మాన్ హిజ్రీ యొక్క 35వ సంవత్సరం జిల్‌హిజ్ మాసంలో చంపబడ్డారు, వారి తరువాత ప్రజలు హజ్రత్ అలీ(అ.స) ను ఖలీఫాగా ఎన్నుకున్నారు.
ఇమామ్ అలీ(అ.స) యొక్క అధికారం న్యాయధర్మాలతో మరియు ఇస్లామీయ అసలైన సున్నత్ ను తిరిగి ప్రాణం పోసే లక్ష్యంతో మొదలయ్యింది. ఇది కొంతమందికి కష్టంగా అనిపించింది. దాంతో వారు అధికారానికి వ్యతిరేకంగా సమూహాలు సిద్ధం చేశారు. ఈ వ్యతిరేకత పరిణామమే జమల్, సిఫ్ఫీన్ మరియు నెహర్వాన్ యుద్ధాలు; హిజ్రత్ యొక్క 36, 37 మరియు 38వ సంవత్సరాలలో ఈ మూడు యుద్ధాలు జరిగాయి.
హిజ్రత్ తరువాత మదీనహ్‌లో దైవప్రవక్త(స.అ) ఇస్లామీయ అధికారాన్ని నిర్మించారు. హజ్రత్ అలీ(అ.స) అధికారం దురదృష్టవశాత్తు చాలా కొద్దికాలమే అయినా, దైవప్రవక్త(స.అ) తరువాత పరిపూర్ణ ఇస్లామీయ అధికారం, హజ్రత్ అలీ(అ.స) అధికారమే అని చెప్పుకోవచ్చు. ఈ కొంతకాలంలోనే అంతర్గత పన్నాగాల వల్ల అనుకున్నవన్నీ చేయలేకపోయారు కాని ఇస్లామీయ అధికారం ఎలా ఉండాలో నేర్పించారు.
చివరికి అధికారంలో వచ్చిన నాలుగు సంవత్సరాల కొన్ని నెలల తరువాత హిజ్రీ 40వ ఏట రమజాన్ మాసం 19వ తారీఖున కూఫా మసీదులో నమాజ్ చేస్తుండగా మారిఖీన్ సమూహానికి చెందిన అబ్దుర్రహ్మాన్ ఇబ్నె ముల్జిమ్ వారి తల పై విషపూరితమైన ఖడ్గంతో చేసిన దాడి ద్వార ఏర్పడిన గాయం వల్ల రమజాన్ మాసం 21వ తేదిన మరణించారు.
వ్యాఖ్యానించండి