హుదైబియహ్ సంధి ఏమిటి, ఎక్కడ జరిగింది మరియు అప్పుడు సహాబీయుల ప్రవర్తన ఎలా ఉండింది అన్న విషయాల పై సంక్షిప్త వివరణ...

హిజ్రీ యొక్క 6వ సంవత్సరంలో దైవప్రవక్త(స.అ) తమ 14 వందల సహాబీయులతో ఉమ్రా ఉద్దేశంతో మదీనా నుండి బయలుదేరారు. అందరికి తమ ఖడ్గాలను వాటి ఒరలోనే ఉంచమని ఆదేశించారు. కేవలం ఉమ్రా చేసుకునేందుకే వచ్చాము అస్సల యుధ్ధ చేసే ఉద్దేశమే లేదు అని ఖురైషియులకు అర్ధమైయ్యే విధంగా “జుల్ హలీపహ్”( మక్కా పట్టణానికి అతి దగ్గర ప్రదేశం.) లో అందరు ఎహ్రామ్(హజ్జ్ చేసే సమయంలో ధరించే ప్రత్యేక దుస్తులు.) ధరించి మరియు తఖ్లీద్(అల్లాహ్ మొక్కుబడికి సూచనగా మొడలలో వేసే పట్టెడలు.) తో బలిచ్చే జంతువులను తీసుకొని బయలుదేరారు అయినప్పటికీ ఖురైషియులకు ముహమ్మద్(స.అ) తమ శక్తి సామర్ధ్యాలతో మక్కాలో ఖురైషియుల ఆడంబరాన్ని, ప్రతిష్టను మరియు దర్జాను మట్టి కరిపించారని అరేబీయుల ఎక్కడ అనుకుంటారో అని భయం పుట్టుకొచ్చింది. అందుకు “సుహైల్ బిన్ అమ్ర్ బిన్ అబ్దెవద్ అల్ ఆములి” ఆథిపత్యంలో ముహమ్మద్(స.అ) వద్దకు ఒక రాయబార సంఘంను దైవప్రవక్త(స.అ)తో “ఈ సంవత్సరం తిరిగి వెళ్ళిపోమని, వచ్చే సంవత్సరం మూడు రోజులు మనశ్శాంతిగా ఉమ్రా చేసుకునేందుకు మక్కాను ఖాళీ చేస్తాము” అని కోరమని పంపారు.
దాంతో పాటు కొన్ని కఠిన షరత్తులు కూడా పెట్టారు. అయినప్పటికీ దైవప్రవక్త(స.అ) ఇస్లాం శుభహేతువు కోరి వాటిని అంగీకరించారు. కాని సహాబీయులలో కొందరికి దైవప్రవక్త(స.అ) ఈ నిర్ణయం కొంచెం కూడా నచ్చలేదు. వాళ్ళు చాలా ఉగ్రంగా వ్యతిరేకించారు చివరకి ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ వచ్చి మోటైన స్వరంలో “మీరు నిజమైన దైవప్రవక్త(స.అ) కారా”? అని ప్రశ్నించారు. దైవప్రవక్త(స.అ) “నిస్సందేహముగా!” అని అన్నారు. “మేము సత్యమార్గంపై మరియు మన శత్రువులు అసత్యమార్గంపై లేరా”? అని అడిగారు. దైవప్రవక్త(స.అ) “నిస్సందేహముగా మీరు చెప్పినట్లే” అని అన్నారు. “అయితే మేము మా మతం పట్ల ఇటువంటి అవమానాన్ని సహించలేము” అని ఉమర్ అన్నారు. “చూడండి, నేను అల్లాహ్ ప్రవక్త(స.అ)ను. నేను అల్లాహ్ పట్ల అపరాధానికి పాలుపడలేను ఎందుకంటే అల్లాయే నాకు రక్ష” అని దైవప్రవక్త(స.అ) అన్నారు. “అతి త్వరలో మేము కాబాకు వెళ్ళి ప్రదక్షణాలు చేద్దామని మాతో మీరు చెప్పేవారు కారా?” అని ఉమర్ అడిగారు. కాని నేను “ఈ సంవత్సరమే మక్కా వచ్చి ప్రదక్షణాలు చేస్తామని అన్నానా!” అని దైవప్రవక్త(స.అ) అన్నారు. “ఇలా అని అనలేదు” అని ఉమర్ అన్నారు. “నీవు తప్పకుండా వస్తావు, వచ్చి ప్రదక్షణాలు చేస్తావు” అని దైవప్రవక్త(స.అ) అన్నారు.
ఆ తరువాత ఉమర్ అబూబక్ర్ వద్దకు వచ్చి “ఓ అబూబక్ర్! ఈ మనిషి అల్లాహ్ యొక్క నిజమైన దైవప్రవక్త(స.అ) కాదా”? అని అన్నారు. “అతను నిజమైన ప్రవక్తే” అని అబూబక్ర్ అన్నారు. ఆ తరువాత దైవప్రవక్త(స.అ)కు ప్రశ్నించిన ప్రశ్నలే అబూబక్ర్ తో మరల అడిగారు, అబూబక్ర్, దైవప్రవక్త(స.అ) ఇచ్చిన జవాబులే ఇచ్చి ఇలా అన్నారు: “అతను అల్లాహ్ యొక్క దైవప్రవక్త(స.అ), అతను అల్లాహ్ పట్ల అపరాధానికి పాలుపడలేరు. అల్లాయే అతనికి రక్ష అందుకని నీవు వారినే ఆశ్రయించి ఉండు”. దైవప్రవక్త(స.అ), సంధి పనులను ముగించిన తరువాత తమ సహాబీయులను ఇలా ఆదేశించారు: “మీరందరు వెళ్ళి బలివ్వండి మరియు తల వెంట్రుకలను తీయించుకోండి”. (చరిత్ర కారుడు ఇలా ప్రవచించెను): అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను వాళ్ళలో ఏ ఒక్కరూ కదలలేదు అప్పటికే దైవప్రవక్త(స.అ) మూడు సార్లు ఆదేశించారు. ఎప్పుడైతే ఎవ్వరు కూడా వారి మాట వినలేదో దైవప్రవక్త(స.అ) లేచి తమ డేరాలోకి వెళ్ళిపోయారు. ఆ తరువాత బయటకు వచ్చి ఎవరితో మాట్లాడకుండా తమ తరపు నుండి ఒంటెను బలిచ్చి క్షౌరకుడిని పిలిచి తల వెంట్రుకలు తీయించేశారు. అది చూసి సహాబియులు కూడా వచ్చి బలిచ్చి ఒకరి తల వెంట్రుకలను మరొకరు తీయించుకోవడం మొదలు పెట్టారు. అక్కడ పరిస్థితి ఒకరిని ఒకరు చంపుకుంటారేమోనట్లుగా అయ్యింది.[1]
ఇదీ హుదైబియహ్ సంధి సంఘటన సారాంశం. దీనిపై షియా, సున్నీయులిద్దరూ ఏకాభిప్రాయము కలిగి ఉన్నారు. చరిత్రకారులు ఉదాహరణకి తబరీ, ఇబ్నె అసీర్, ఇబ్నె సఅద్ మొదలగు వారు అలాగే “బుఖారీ” మరియు “ముస్లిం” కూడా వ్రాశారు.
రిఫరెన్స్
1. ఈ సంఘటనను చరిత్రకారులే కాకుండా బుఖారీ తన “సహీ” అను పుస్తకంలో “కితాబుష్షురూతొ ఫిల్ జిహాద్” అను అధ్యాయం, భాగం 8, పేజ్ 122. ముస్లిం తన “సహీ” అను పుస్తకంలో “బాబొ సుల్హె హుదైబియహ్” లో లిఖించారు.
వ్యాఖ్యానించండి