తౌహీద్ పట్ల విశ్వాసం మరియు ప్రాముఖ్యత ను వివరిస్తున్న రెండు సంఘటనలు...

ముస్లిముల విశ్వాసాలన్నింటి కేంద్రం, అల్లాహ్. అయితే కొన్ని మతాలు వ్యక్తులపై దృష్టి పెడుతున్నాయి, ఉదాహరణకు, యేసుక్రీస్తుపై క్రైస్తవత్వం యొక్క దృష్టి, (కాని) ఇస్లాం మతం పూర్తిగా అల్లాహ్ పై దృష్టి పెడుతుంది. ఇస్లాం సంపూర్ణత్వం(అల్లాహ్) పై ఆధారపడింది, ఆయన ఆవిర్భావముల పై కాదు. అల్లాహ్ యొక్క ఏకత్వం గురించి ఖుర్ఆన్ స్వయంగా ప్రవచిస్తుంది: “అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యదైవం లేడని స్వయంగా అల్లాహ్, ఆయన దూతలు, జ్ఞానసంపన్నులూ సాక్ష్యమిస్తున్నారు. ఆయన ఎల్లప్పుడూ న్యాయం పై నిలబడి ఉంటాడు. సర్వాధిక్యుడు, వివేచనాశీలి అయిన ఆయన తప్ప మరొకరేవరూ ఆరాధనకు అర్హులు కారు”[సూరయె ఆలి ఇమ్రాన్, ఆయత్18]
సృష్టికర్త పై వృద్దురాలి నిదర్శనం
ఒకరోజు అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) తమ సహచరులతో కలిసి ఒక చోటు నుండి వెళ్తుండగా, ఒక ముసలావిడను చరఖాను త్రిప్పుతూ దారాన్ని తయారు చేస్తుండగా చూశారు.
ఇమామ్ ఇలా ప్రశ్నించారు: అల్లాహ్ గురించి ఎలా తెలుసుకున్నావు?.
ఆ వృద్ధురాలు సమాధానానికి బదులు, తాను త్రిప్పుతున్న చరఖా పైనుండి తన చేయిని తీసేసుకుంది. ఆ చరఖా తిరగడం ఆగిపోయింది. అప్పుడు ఆ వృద్ధురాలు ఇలా అంది: “ఓ అలీ! ఇంత చిన్న చరఖాకు తిరగడానికి నా అవసరం ఉంది, మరలాంటప్పుడు పెద్ద పెద్ద ఖగోళాలు, ఆకాశాలు మరియు భూమీ, ఇవన్నీ ఒక వివేకవంతుడైన నేర్పరి మరియు బలమైన సృష్టికర్త లేకుండా ఆగకుండా తిరుగుతూ ఉండడం ఎలా సాధ్యమౌతుంది?”
ఇమామ్ సహచరుల వైపు తిరిగి వారితో ఇలా అన్నారు: “వృద్ధ స్ర్తీలు అల్లాహ్ ను తెలుకున్నట్లు, తెలుసుకోండి”[1].
తౌహీద్ ప్రాముఖ్యత అలీ(అ.స) నోట
జమల్ యుద్ధంలో ఇమామ్ అలీ(అ.స) సైన్యం మరియు తల్హా జుబైర్ల సైన్యంతో ఎదురెదురుగా యుద్ధం చేస్తుండగా, ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు: “నేను తౌహీద్ గురించి అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను” సైనికులు “ఇప్పుడు సమయం కాదు” అని అతడి పై అభ్యంతరం వ్యక్తం చేయసాగారు. ఈ విషయం ఇమామ్ అలీ(అ.స) తెలిసింది, అభ్యంతరం వ్యక్తం చేసిన వారితో ఇలా అన్నారు: “అతడిని విడవండి, వచ్చి అడగాలనుకున్నది అడగనివ్వండి; మేము తౌహీద్ ను బలపరచడానికి మరియు అల్లాహ్ గురించి తెలియపరచడానికే ఈ యుద్ధం చేస్తున్నాము”
అప్పుడు ఆ వ్యక్తి ఇమామ్ వద్దకు వచ్చి తౌహీద్ కు సంబంధించిన ప్రశ్న అడిగాడు. ఇమామ్ సమాధానం ఇవ్వగా అతడు తౌహీద్ యొక్క యదార్థాన్ని మరియు సరైన అర్థాన్ని తెలుసుకున్నాడు.[2]
రిఫరెన్స్
1. సయ్యద్ అలీ అక్బర్ సదాఖత్, ఎక్ సద్ మౌజూ పాన్సద్ దాస్తాన్, భాగం2, పేజీ170 ఇంతెషారాతె తహ్జీబ్, చాప్4, 1387.
2. సయ్యద్ అలీ అక్బర్ సదాఖత్, ఎక్ సద్ మౌజూ పాన్సద్ దాస్తాన్, భాగం2, పేజీ171, ఇంతెషారాతె తహ్జీబ్, చాప్4, 1387.
వ్యాఖ్యానించండి