“మబ్అస్” అని ఏ రోజును అంటారు మరియు ఆ రోజు చేయవలసిన ప్రత్యేక చర్యలు ఏమిటి అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

“మబ్అస్” అనగా అంతిమ ప్రవక్త హజ్రత్ ముహమ్మద్(అ.స) ను అల్లాహ్ తన ప్రవక్తగా ఎన్నుకొన్న రోజు. సర్వసృష్టిలో అల్లాహ్ కు మాననీయుడైన దైవప్రవక్త మొహమ్మద్(స.అ) ఈ లోకానికి ఆ అల్లాహ్ తరపునుండి ఒక దైవదూతగా, ఒక శాంతిస్వరూపునిగా పంపబడటం ఈ సమస్త మానవజాతి పై అల్లాహ్ చేసిన మహోపకారం అని చెప్పవచ్చు. అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్ లో ఈ విధంగా సెలవిస్తున్నాడు: “అల్లాహ్ విశ్వాసులకు చేసిన మహోపకారం ఏమిటంటే,ఆయన వారిలో నుండే ఒక ప్రవక్తను ఎన్నుకుని వారి వద్దకు పంపాడు.అతడు వారికి ఆయన వాక్యాలను చదివి వినిపిస్తాడు.వారిని పరిశుధ్ధుల్ని చేస్తాడు.వారికి గ్రంధ జ్ఞానాన్ని,వివేకాన్ని బోధిస్తాడు.నిశ్చయంగా అంతకు ముందైతే వాళ్ళు స్పష్టమైన అపమార్గానికి లోనై ఉండేవారు”. (సూరయె ఆలి ఇమ్రాన్, ఆయత్164). అంధ విశ్వాసాలతో అజ్ఞానపు చీకటిలో కూరుకుపోయిన, ఇతరులపై సోదరభావం మరియు ప్రేమలు కరువై జాతి మరియు తెగల రూపంలో ముక్కలుగా విడిపోయి బ్రతుకుతున్న ఆ అరబీయ సమాజంలో ఒక కాంతిరేఖగా ఒక కరుణామయుడి రూపంలో దైవప్రవక్త(స.అ) పంపబడ్డారు.
వేరే చోట పవిత్ర ఖుర్ఆన్ లో ఈ విధంగా ఉల్లేఖించబడి ఉంది: (ఓ ముహమ్మద్!) మేము నిన్ను సమస్త లోకవాసుల కోసం కారుణ్యంగా చేసి పంపాము (సూరయె అంబియా, ఆయత్107). ఆ దైవప్రవక్త(స.అ) ఉనికియే ఈ లోకానికి కారుణ్యమైనప్పుడు ఆయన దైవప్రవక్త(స.అ) ఎన్నుకోబడ్డ రోజు అయిన “మబ్‌అస్” పండుగ రోజు ఎందుకు కాకూడదు? అది నిజంగా పండుగ రోజు.
దైవప్రవక్త(స.అ) దౌత్యం యొక్క లక్ష్యం
దైవప్రవక్త(స.అ) దౌత్యం యొక్క లక్ష్యం ఆయతుల మరియు హదీసుల వివరణ ప్రకారం:
1. అల్లాహ్ యొక్క ఆరాధన మరియు విగ్రాహారాధన నిషేధన.
2. గ్రంథ బోధన మరియు విజ్ఞత శిక్షణ.
3. ప్రజలలో న్యాయపరిపాలన.
4. అజ్ఞానపు మరియు అవిశ్వాసపు అంధాకారం నుండి విముక్తి.
5. బుద్ధి వివేకాలను పరిపూర్ణ స్థాయికి చేర్చటం.
6. సత్ప్రవర్తన మరియు సద్గుణాలను పరిపూర్ణ స్థాయికి చేర్చటం.
7. ప్రజల వ్యతిరేకతలలో తీర్పరి.
8. అనుగ్రహాలను గుర్తు చేయటం.
9. మనిషికి స్వేచ్ఛ మరియు స్వాతంత్రం కలగచేయటం.
మబ్అస్ రోజు చేయవలసిన ఆమాల్
ఈదె “మబ్అస్” రోజు, దైవప్రవక్త హజ్రత్ ముహమ్మద్(స.అ) ప్రవక్తగా ఎన్నుకోబడిన రోజు కాబట్టి ఇస్లాంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజులలో ఒకటిగా భావిస్తారు. ఈ రోజు చాలా పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది మరియు హదీసులలో ఈ రోజుకు చాలా ప్రాముఖ్యత కలదు. ఈ రోజున కొన్ని ప్రత్యేక ఆమాల్(దినచర్యలు) హదీసులలో ప్రస్థావించటం జరిగింది.
1. గుస్ల్ స్నానం.
2. ఉపవాసం (సంవత్సరంలో ఏ నాలుగు రోజులలో ఉపవాస దీక్షను నిర్వర్తించడం పై తాకీదు చేయబడి ఉందో వాటిలో ఒకటి., మరి ఈ రోజున ఉపవాసం ఉండటం డబ్బై సంవత్సరాలు ఉపవాస దీక్షలను నిర్వర్తించడంతో సమానం).
3. సల్వాత్ చదవటం.
4. దైవప్రవక్త(స.అ) మరియు అమీరుల్ మొమినీన్ అలీ(అ.స) జియారత్.
5. మిస్బాహ్ యొక్క పుస్తకంలో రయ్యాన్ బిన్ అస్‌సల్త్ ఈ విధంగా చెప్పారు: ఇమాం జవాద్(అ.స) బగ్దాద్ లో ఉన్నప్పుడు రజబ్ యొక్క 15వ తారీకున మరియు 27వ తారీకున ఉపవాసం ఉండేవారు మరియు తన చుట్టూ ఉండేవారు కూడా ఉపవాసం ఉండేవారు. ఆ రోజున 12 రకాతుల నమాజు చేయమని, ఆ నమాజు చేసిన తరువాత అల్ హంద్, తౌహీద్, ఫలఖ్ మరియు నాస్ సూరాలను నాలుగు సార్లు పఠించమని ఆదేశించారు. వ లాఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ వ సుబ్ హానల్లాహి వల్ హందులిల్లాహి వలా హౌలవలా ఖువ్వత ఇల్లాబిల్లాహిల్ అలియ్యిల్ అజీం నాలుగు సార్లు,అల్లాహు అల్లాహు రబ్బి లా ఉష్రికు బిహి షైఆ నాలుగు సార్లు, లా ఉష్రికు బిరబ్బి అహదా నాలుగు సార్లు.
6. హుసైన్ బిన్ రౌహ్ వివరణ ప్రకారం 12 రకాతుల నమాజు, మరియు ప్రతీ నమాజులో అల్ హంద్ సూరహ్ తరువాత మీకు తోచిన ఏ సూరా అయినా పఠించవలెను మరియు ఆ నమాజు పూర్తి చేసిన తరువాత ప్రతీ రెండు రకాతుల నమాజు మధ్యలో ఈ దుఆ ను చదవవలెను అల్ హందులిల్లాహిల్లజీ లం యత్తఖిజ్ సాహిబతన్ వలా వలదా... (మఫాతీహ్ లో ఈ దు ఆ కలదు).
7. యా మన్ అమర బిల్ అఫ్వ్ వత్తజావుజ్ వ జమ్మన నఫ్సహు... (ఈ దుఆ కూడా మఫాతీహ్ లో కలదు).[1]
రెఫరెన్స్
1. మఫాతీహుల్ జినాన్, షైఖ్ అబ్బాస్ ఖుమ్మీ, ఆమాలే ఈదె మబ్అస్.
వ్యాఖ్యానించండి