ఇమామ్ మహ్దీ ముంతజర్(అ.స) ఎవరు, వారు అదృశ్యం అవ్వడానికి కారణాలేమిటి అన్న విషయాల పై సంక్షిప్త సూచన...

ఇమామ్ మహ్దీ(అ.స), దైవప్రవక్త(స.అ) యొక్క 12వ ఉత్తరాధికారి. వారు షాబాన్ యొక్క 15వ తేది, 255హిజ్రీ సామర్రా పట్టణంలో జన్మించారు. వారి పేరు దైవప్రవక్త(స.అ) పేరు. వారి కున్నియత్ కూడా దైవప్రవక్త(అ.స) కున్నియత్. వారి అసలు పేరు చెప్పకూడదు అని పవిత్ర మాసూములు నిషేదించారు.
వారి బిరుదులలో ముఖ్యమైనవి; “హుజ్జత్”, “ఖాయిమ్”, “ఖలఫె సాలెహ్”, “సాహిబుజ్జమాన్”, “బఖియతుల్లాహ్” ప్రసిద్ధి చెందిన బిరుదు “మహ్దీ”
తండ్రి ఇమామ్ హసన్ అస్కరీ(అ.స) తల్లి “నర్జిస్” ఆమెను “రైహానహ్”, “సౌసన్” మరియు “సఖీల్” అనీ కూడా పిలుస్తారు.
గైబతె సుగ్రా మరియు కుబ్రా
ఇమామ్ మహ్దీ(అ.స) అదృశ్యమయ్యారు అనే నమ్మకాన్ని గైబత్ అంటారు. ఈ గైబత్ రెండు రకాలు; “గైబతె సుగ్రా” మరియు “గైబతె కుబ్రా”.
గైబతె సుగ్రా హిజ్రీ యొక్క 260వ సంవత్సరం నుంచి 329వ సంవత్సరం వరకు సాగింది అంటే దాదాపు 69 సంవత్సరాలు. గైబతె సుగ్రా కాలంలో షియాలతో ఇమామ్ సంబంధం పూర్తిగా తెగిపోలేదు. ప్రత్యేక ప్రతినిధుల ద్వార వారితో సంబంధం ఉండేది. షియాలు తమ కష్టాలను ఆ ప్రత్యేక ప్రతినిధులకు చెప్పేవారు, వారు ఇమామ్ వద్దకు ఆ కష్టాలను చేర్చేవారు. అలగే ఇమామ్ సమాధాలను ప్రజల వరకు చేర్చేవారు.
ఈ విధంగా ఈ కాలంలో ఇమామ్ ఒక్కోసారి కనబడేవారు ఒక్కోసారి అదృశ్యమయ్యేవారు. ఈ కాలాన్ని వారి పట్ల విశ్వాసం కలిగివున్న షియాలను గైబతె కుబ్రాకు అలవాటు చేస్తున్న కాలంగా అనుకోవచ్చు. గైబతె సుగ్రా కాలం తరువాత గైబతె కుబ్రా యొక్క సుధీర్ఘ కాలం మొదలయ్యింది, ఇప్పటికి కూడా వారి కుబ్రా అదృశ్య కాలమే సాగుతుంది, అల్లాహ్ తరపు నుంచి ప్రత్యక్షం అవ్వడానికి ఆజ్ఞ దొరకనంత వరకు వారి గైబతె కుబ్రా కాలం సాగుతూనే ఉంటుంది.
ఇమామ్ మహ్దీ(అ.స) గురించి దైవప్రవక్త(స.అ) నుంచి వారి 11వ ఉత్తరాధికారి అయిన ఇమామ్ అస్కరీ(అ.స) వరకు అందరూ స్పష్టంగా వివరించారు. వారు ఉల్లేఖించిన హదీసులు షియా మరియు అహ్లెసున్నత్ గ్రంథాలలో ఉల్లేఖించబడి ఉన్నాయి.
అదృశ్యానికి రాజకీయ మరియు సామజిక కారణాలు
1. ప్రజలను పరీక్షించడం; దాసులను పరీక్షించడం, సజ్జనులను ఎన్నుకోవడం మరియు పవిత్రుల ఎంపిక అల్లాహ్ యొక్క ఖచ్చితమైన సున్నత్ అని అందరికి తెలియపరచడం.
2. ఇమామ్ ప్రాణ రక్షణ; ఇమామ్ అప్పుడే ప్రజల మధ్యలో ప్రత్యేక్షమై ఉంటే వారిని చంపేసేవారు. దాంతో అల్లాహ్ లక్ష్యం పూర్తయ్యేది కాదు.
3. దుర్మార్గపు అధికారంలో ఇమామ్ ఉండకూడదనే ఉద్దేశం; ఇమామ్ మహ్దీ(అ.స) ఎటువంటి అధికారం పట్ల విధేయత కలిగి ఉండకూడదు. వారు ఒక్క క్షణం కోసం కూడా దుర్మార్గపు అధికారానిక లోబడి ఉండకూడదు. వారు ప్రత్యేక్షమయితే వారే అందరి పై అధికారం చేయాలి.
ఇమామ్ మహ్దీ(అ.స) యొక్క ప్రత్యేక ప్రతినిధులు
ఇమామ్ మహ్దీ(అ.స) యొక్క ప్రత్యేక ప్రతినిధులను “నువ్వాబె అర్బఅ” అనగా నలుగురు ప్రతినిధులు. ఇమామ్ యొక్క “గైబతె సుగ్రా” కాలంలో వారికి ప్రతినిధులు ఉండేవారు, వారు నలుగురు. వారి పేర్లు:
1. అబూ అమ్ర్ ఉస్మాన్ ఇబ్నె సయీదె అమ్రీ,
2. అబూ జాఫర్ మొహమ్మద్ ఇబ్నె ఉస్మాన్ ఇబ్నె సయీదె అమ్రీ,
3. అబుల్ ఖాసిమ్ హుసైన్ ఇబ్నె రౌహె నౌబఖ్తీ,
4. అబుల్ హసన్ అలీ ఇబ్నె మొహమ్మదె సమరీ.
అయితే వీరు కాకుండా ఇమామ్ యొక్క వేరే ప్రతినిధులు వివిధ ప్రాంతాలలో ఉదాహారణకు; బగ్దాద్, కూఫా, అహ్వాజ్, హమెదాన్, ఖుమ్, రయ్, ఆజర్ బాయిజాన్, నైషాబూర్ మొ॥ ఉండేవారు. వీరు ఆ నలుగురి ప్రత్యేక ప్రతినిధుల ద్వార ప్రజల సమస్యలను ఇమామ్ వరకు చేర్చేవారు. ఇమామ్ తరపు నుంచి “తౌఖీ”[1] పపించేవారు.
అల్లాహ్ ఇమామ్ మహ్దీ(అ.స)ను త్వరగా ప్రత్యక్షం చేసి ఈ సమాజాన్ని మానవులను పరిపూర్ణ స్థాయిని చేర్చే సమాజంగా మార్చాలని కోరుతున్నాము.
రిఫరెన్స్
గైబతె సుగ్రా కాలంలో ఇమామ్ మహ్దీ తరపు నుంచి వారి షియా కోసం ఉత్తరం లేదా ఆదేశం రావడాన్ని షియా ఉలమాలు తౌఖీ అంటారు.
వ్యాఖ్యానించండి