షాబాన్ మాసం 14వ తారీఖు రాత్రి యొక్క ప్రాముఖ్యత మరియు ఆ రాత్రి చేయవలసిన కొన్ని ప్రత్యేక ఆమాల్ వివరణ...

నీమ్ అనగా ఫార్శీ భాషలో సగం అని అర్ధం. ఈ పదం ఉర్దూ భాషలో కూడా ఉపయోగించబడుతుంది మరి ఇందులో కూడా సగం అని అర్ధం. నీమయె షాబాన్ అనగా షాబన్ మాసం యొక్క సగం అని అర్ధం అనగా 14వ రాత్రి నుండి 15 తారీఖు రాత్రి వరకు. షాబాన్ మాసం యొక్క 14వ తారీఖు రాత్రిని “షబె నీమయె షాబాన్” అని అంటారు. ఈ రాత్రిని “షబే బరాత్” అని కూడా అంటారు. మాసూమీన్(అ.స)ల రివాయత్ లలో ఈ రాత్రి జాగరణ చేయాలని తాకీదు చేయబడి ఉంది.
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స)తో “షబే నీమయే షాబాన్” గురించి అడిగినప్పుడు వారు ఇలా ఉల్లేఖించారు: “ఈ రాత్రి ‘షబే ఖద్ర్’ తప్ప అన్ని రాత్రుల పై ప్రతిష్టత గల రాత్రి, అందుకని ఈ రాత్రిని అల్లాహ్ సామిప్యాన్ని పొందేందుకు ప్రయత్నించాలి. ఈ రాత్రి అల్లాహ్ తన దాసులను కరుణించి వారి పాపములను క్షమిస్తాడు. ఈ రాత్రి ఎవ్వరినీ ఉట్టిచేతులతో పంపను కేవలం పాపమునకు సంబంధించిన కోరికలు గల వారిని తప్ప, అని అల్లాహ్ స్వయంగా తన పై ప్రమాణం చేశాడు”
ఈ రాత్రంతా నమాజ్, దుఆ మరియు అస్తగ్ఫార్ చేస్తూ జాగరణ చేయడం వల్ల అతిగా పుణ్యం లభిస్తుంది. ఇమామ్ జైనుల్ ఆబెదీన్(అ.స) ఉల్లేఖనం: “ఎవరైతే ఈ రాత్రి జాగరణ చేస్తాడో, అందరి హృదయాలు నిర్జీవంగా ఉండే రోజున అతడి హృదయం సంజీవంగా ఉంటుంది”[1]
ఈ రాత్రికి మరో ప్రత్యేకత హజ్రత్ ఇమామ్ మహ్దీ(అ.స) జన్మించడం, రాత్రి గడిచిన తరువాత సహర్ సమయంలో వారు జన్మించారు. ఈ రాత్రిలో కొన్ని ప్రత్యేక ఆమాల్ ఉన్నాయి..
1. గుస్ల్ స్నానం చేయడం. ఇది పాపముల బరువును తరిగిస్తుంది.
2. జియారతె ఇమామ్ హుసైన్(అ.స) ఉత్తమ చర్య. ఇది పాపములు క్షమించబడతాయి. ఎవరైతే 124 వేల ప్రవక్తతో ముసాఫహా చేయాలనుకుంటే ఇమామ్ హుసైన్(అ.స) జియారత్ చేయాలి.
జియారత్ యొక్క మిక్కిలి చర్య మేడ మీద వెళ్లి ఎడమ వైపు మరియు కుడి వైపు చూడలి ఆ తరువాత తలను ఆకాశం వైపు ఎత్తి ఇలా జియారత్ చదవాలి: “అస్సలాము అలైక యా అబాఅబ్దిల్లాహ్, అస్సలాము అలైక వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్”
ఇలా ఎవరు ఎక్కడ నుండి చేసినా మరియు ఏ కాలంలో అయినా సరే ఈ విధంగా జియారత్ చేస్తారో, వారికి హజ్ మరియు ఉమ్రా పుణ్యం లిఖించబడుతుంది.
3. దుఆయె కుమైల్ చదవాలి.
4. సుబ్హానల్లాహ్, అల్ హందులిల్లాహ్, అల్లాహు అక్బర్ మరియు లా ఇలాహ ఇల్లల్లాహ్ లను 100 సార్లు చదవాలి. దాంతో అల్లాహ్ మునుపటి పాపములన్నీంటిని క్షమిస్తాడు మరియు ఇహపరలోకాల కోరికలను తీరుస్తాడు.
5. షబె నీమయె షాబాన్ యొక్క ప్రత్యేకత గురించి అబూ యహ్యా నుండి రివాయత్ లో ఇలా ఉల్లేఖించబడింది: నేను నా స్వామి ఇమామ్ సాదిఖ్(అ.స) తో ఇలా అడిగాను: ఈ రాత్రిలో ఉత్తమ దుఆ ఏమిటీ? ఇమామ్ ఇలా సెలవిచ్చారు: ఇషాఁ నమాజ్ చదివిన తరువాత, రెండు రక్అత్లు ఈ విధంగా చదువు: మొదటి రక్అత్ లో సూరయె అల్ హంద్ మరియు సూరయె కాఫిరూన్ మరియు రెండవ రక్అత్ లో సూరయె అల్ హంద్ మరియు సూరయె తౌహీద్ చదవాలి, సలామ్ తరువాత సుబ్హానల్లాహ్ 33 సార్లు, అల్ హందులిల్లాహ్ 33 సార్లు మరియు అల్లాహు అక్బర్ 34 సార్లు జపించి ఇలా అను: “యా మన్ ఇలైహీ మల్ జఉల్ ఇబాది ఫీల్ ముహిమ్మాత్........(పూర్తి దుఆను చదవాలి)” ఆ తరువాత సజ్దాలో వెళ్లి 20 సార్లు యారబ్బ్, 7 సార్లు యా అల్లాహు, 7 సార్లు లా హౌల వలా ఖువ్వత ఇల్లాబిల్లాహ్, 10 సార్లు మాషాఅల్లాహ్, 10 సార్లు లా ఖువ్వత ఇల్లా బిల్లాహ్. ఆ తరువాత దైవప్రవక్త ముహమ్మద్(స.అ) మరియు వారి అహ్లెబైత్(అ.స) పై సలవాత్ చదివి అల్లాహ్ ను ప్రార్థించాలి.[2]
రిఫరెన్స్
1. షేఖ్ అబ్బాసె ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, షాబాన్ ఆమాల్ అధ్యాయంలో.
2. https://www.erfan.ir/mafatih105/فضیلت-و-اعمال-شب-نیمه-شعبان-کلیات-مفاتیح-الجنان-با-ترجمه-استاد-حسین-انصاریان
వ్యాఖ్యానించండి