హజ్రత్ అలీ(అ.స) ప్రతిష్టతను వ్యక్తం చేస్తున్న ఆయతులు మరియు హదీసుల వివరణ...

దైవప్రవక్త(స.అ) స్వయంగా తన ఉత్తరాధికారి అయిన హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) ప్రతిష్టతలు ప్రతీ అనుకూల సందర్భాలలో ప్రవచించారు. వారి ప్రతిష్టతలను వివరించారు. ప్రజలకు వారిని పరిచయించారు. ఉదా:
మొదటి హదీస్: దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం:
إِنَ هَذَا أَخِي وَ وَصِيِّي وَ خَلِيفَتِي بَعْدِي فَاسْمَعُوا لَهُ وَ أَطِيعُوا
“ఇతను నా సోదరుడు, నా వసీ(నిర్వహకుడు), నా తరువాత నా ఖలీఫా అందుకని ఇతని మాట వినండి మరియు ఇతని పట్ల విధేయత కలిగివుండండి”.[1]
రెండవ హదీస్: దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం:
أَنْتَ مِنِّي بِمَنْزِلَةِ هَارُونَ مِنْ مُوسَى إِلَّا أَنَّهُ لَا نَبِيَ بَعْدِي
(ఓ అలీ) మూసాతో హారూన్‌కు ఉన్న పోలికే నాతో నీకు ఉన్న పోలిక, కాకపోతే నా తరువాత ఇక ప్రవక్త లేడు”.[2]
మూడవ హదీస్: దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం:
مَنْ أَرَادَ أَنْ يَحْيَا حَيَاتِي وَ يَمُوتَ مَوتِي وَ يَسْكُنُ جَنَّةَ الْخُلْد الَّتِي وَعَدَنِي رَبِّي فَلْيَتَوَلَّ عَلِيَّ بْنَ أَبِي طَالِبٍ فَإِنَّهُ لَنْ يُخْرِجَكُمْ مِنْ هُدًى وَ لَنْ يُدْخِلَكُمْ فِي ضَلَالَة
“ఎవరైతే నా వలే జీవించాలని, నా వలే మరణించా లని మరియు శాశ్వతంగా అల్లాహ్ నాకు మాటిచ్చిన ఆ స్వర్గ ఉధ్యానవనంలో ఉండే ఆశ కలిగి ఉన్నారో (వారు) నా తరువాత అలీ(అ.స)ను ఇష్టపడాలి, ఎందుకంటే అతను మిమ్మల్ని రుజుమార్గం నుండి తప్పనివ్వరు, అవిశ్వాసంలో వెళ్ళనివ్వరు”.[3]
ఇమామ్ ను ఎవరు నియమిస్తాడు?
ఇస్లాం ధర్మాన్ని ఎవరైతే అవతరింపజేశాడో ఆయనే ఇమామ్ ను కూడా నియమిస్తాడు, అందులో సందేహపడనవసరం లేదు.
అల్లాహ్ యే ఇమామ్ ను నియమిస్తాడు అన్న విశ్వాసం పై ఖుర్ఆన్ యొక్క కొన్ని ఆయతులే దానికి నిదర్శనం:
మొదటి ఆయత్
وَجَعَلْنَاهُمْ أَئِمَّةً يَهْدُونَ بِأَمْرِنَا وَأَوْحَيْنَا إِلَيْهِمْ فِعْلَ الْخَيْرَاتِ وَإِقَامَ الصَّلَاةِ وَإِيتَاءَ الزَّكَاةِ وَكَانُوا لَنَا عَابِدِينَ
“మా ఆజ్ఞానుసారం మార్గదర్శకత్వం నెరపేవారిని మేము ఆయిమ్మహ్(నాయకులు)గా చేశాము. మేము వహీ ద్వారా సత్కార్యాలు చెయ్యండి అనీ, నమాజ్‌ను స్థాపించండి అనీ, జకాత్ చెల్లించండి అనీ వారికి బోధించాము. వారందరూ మమ్మల్ని ఆరాధించేవారు”[అంబియా సూరహ్, ఆయత్73].
రెండవ ఆయత్
وَجَعَلْنَا مِنْهُمْ أَئِمَّةً يَهْدُونَ بِأَمْرِنَا لَمَّا صَبَرُوا وَكَانُوا بِآيَاتِنَا يُوقِنُونَ
వారు సహనం వహించినపుడు, మా వాక్యాలను గట్టిగా నమ్మినపుడు, మేము వారిలో నాయకులను ప్రభవింపజేశాము[సజ్దహ్ సూరహ్, ఆయత్24]
మూడవ ఆయత్
وَنُرِيدُ أَنْ نَمُنَّ عَلَى الَّذِينَ اسْتُضْعِفُوا فِي الْأَرْضِ وَنَجْعَلَهُمْ أَئِمَّةً وَنَجْعَلَهُمُ الْوَارِثِينَ
భూమిలో అణచివేయబడిన వారిని కనికరించాలనీ, వారినే(ప్రజల పై) నాయకులుగా చేయాలనీ, వారినే వారసులుగా చేయాలనీ మేము ఉద్దేశించాము[ఖసస్ సూరా:28, ఆయత్:5].
ఇక్మాల్ ఆయత్
ఇక్మాల్ ఆయత్ ఇమామ్ అలీ(అ.స) యొక్క ఖిలాఫత్ కు సంబంధించిన ఆయత్.
الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَ أَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَ رَضِيتُ لَكُمُ الإِسْلاَمَ دِينا
ఈ రోజు నేను మా దీన్
ని మీ కొరకు పరిపూర్ణం చేశాను. మీ పై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. మీ కొరకు ఇస్లాం ధర్మాన్ని ఇష్టానుసారమైనదిగా చేశాను.[మాయిదహ్ సూరహ్, ఆయత్3]
“దైవప్రవక్త(స.అ), ‘గదీర్ మైదానం’లో హజ్రత్ అలీ(అ.స) యొక్క ఖిలాఫత్ అధికార ప్రకటన తరువాత ఈ ఆయత్ అవతరించబడింది” అని షియా ముస్లింలందరూ ఏకీభవిస్తారు. మరి ఈ విషయాలను పవిత్ర అహ్లెబైత్(అ.స) ల రివాయతులతో నిరూపిస్తారు. అందుకని షియా ముస్లింలు “ఇమామత్”ను ఉసూలె దీన్(మూల నమ్మకాలు) నుండి అని భావిస్తారు.
మరి అలాగే అహ్లె సున్నత్‌లకు చెందిన చాలా ఉలమాలు కూడా ఈ ఆయత్ అవతరించబడడానికి గల కారణం, “గదీరె ఖుమ్”లో హజ్రత్ అలీ(అ.స) ఖిలాఫత్ ప్రకటన తరువాత అని ఒప్పుకున్నారు. ఉదాహారణకు ఇబ్నె అసాకిర్, తారీఖె దమిష్ఖ్‌లో. ఇబ్నె మగాజీ, మనాఖిబే అలీ(అ.స)లో ఉల్లేఖించారు. [4]
గదీర్ సందేశాన్ని నిరాకరించిన మొదటి వ్యక్తి
“గదీరె ఖుమ్”లో హజ్రత్ అలీ(అ.స)ను దైవప్రవక్త(స.అ) తన ఉత్తరాధికారి మరియు తన తరువాత ముస్లిముల నాయకుడిగా నియమించిన వార్త అందరికి తెలిసింది. అలా అలా “హారిస్ ఇబ్నె నోమానె ఫెహ్రీ” అనబడే వ్యక్తి వరకు కూడా చేరింది కాని అతడికి ఈ మాట నచ్చలేదు. అతడు దైవప్రవక్త(స.అ) వద్దకు వచ్చి ఓ ముహమ్మద్! నీవు నీ తమ్ముడిని అందరి పై ప్రతిష్టతను ప్రసాదించి “నేను ఎవరికి స్వామినో అలీ(అ.స) కూడా వారికి స్వామి” అని ప్రకటించావు, అయితే ఈ మాట అల్లాహ్ తరపు నుండి చెప్పావా లేక నీ తరపు నుండా చెప్పావా? అని అడిగాడు. ఇది విని దైవప్రవక్త(స.అ) కళ్ళు(కోపంతో) ఎర్రబడ్డాయి, మూడు సార్లు “ఆయన తప్ప మరెవ్వరూ పరమేశ్వరుడు కానటువం టి ఆ అల్లాహ్ ప్రమాణంగా ఇది అల్లాహ్ తరపు నుండి నా తరపు నుండి కాదు” అని అన్నారు. హారిస్ ఇది విని నిలబడి “ఓ అల్లాహ్ ముహమ్మద్(స.అ) చెప్పేది ఒకవేళ నిజం అయితే నా పై ఆకాశం నుండి రాళ్ళను కురిపించు లేదా బాధాకరమైన శిక్ష విధించు” అని అన్నాడు. రావి ఇలా ఉల్లేఖించెను: అల్లాహ్ సాక్షిగా అతడు ఇంకా తన ఒంటె వరకు కూడా చేరలేకపోయాడు ఆకాశం నుండి అతడి తలపై ఒక రాయి వచ్చి పడింది మరి అది అతడి క్రిందిభాగం నుండి బయటకు వచ్చేసింది, అతడు అక్కడికక్కడే చనిపోయాడు. అప్పుడు అల్లాహ్ తరపు నుండి ఈ ఆయత్ అవతరింపబడింది:
سَأَلَ سَائِلٌ بِعَذَاب وَاقِع لِلْکَافِرینَ لَیْسَ لَهُ دَافِعٌ
అడిగేవాడు అవిశ్వాసుల కొరకే సంభవించే శిక్షను గురించి అడిగాడు. అది తప్పకుండా సంభవిస్తుంది.[మఆరిజ్ సూరహ్, ఆయత్1,2][5].
గదీర్ పండగ
గదీర్ రోజు గురించి దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించారు: “గదీర్ ఖుమ్ రోజు నా ఉమ్మత్ యొక్క గొప్ప పండగ, ఆ రోజున అల్లాహ్ నా సోదరుడు అలీ ఇబ్నె అబీతాలిబ్ ను నా తరువాత నా ఉమ్మత్ హిదాయత్ కోసం నా ఉమ్మత్ యొక్క నాయకుడిగా నిర్ధారించమని నన్ను ఆదేశించాడు. అదే రోజు అల్లాహ్ ఇస్లాంకు పరిపూర్ణత ప్రసాదించాడు, తన అనుగ్రహాలను పూర్తి చేశాడు, ఇస్లాం ధర్మాన్ని వారి కోసం సమ్మతించాడు”[5].
అల్‌హందు లిల్లాహిల్లజీ జఅలన మినల్ ముతమస్సికీన బి విలాయతి అమీరిల్ మోమినీన్(అ.స)
రిఫరెన్స్
1. తారీఖె తబరి, భాగం2, పేజీ319. తారీఖె ఇబ్నె అసీర్, భాగం2, పేజీ62.
2. సహీ ముస్లిం, భాగం7, పేజీ120. సహీ బుఖారీ, ఫజాయిలె హజ్రత్ అలీ(అ.స).
3. ముస్తద్రికుల్ హాకిం, భాగం3, పేజీ128. తబరాని తన పుస్తకం మోజమే కబీర్‌లో కూడా వ్రాశారు.
4. ఇబ్నె అసాకిర్, తారీఖె దమిష్ఖ్, భాగం2, పేజీ75. ఇబ్నె మగాజీ, మనాఖిబే అలీ(అ.స), పేజీ19.
5. తబర్సీ, మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ352.
అల్లామహ్ అమీనీ, గుజీదయీ జమె అజ్ అల్ గదీర్, ముతర్జిమ్ షాహ్రూదీ, ముఅస్ససయే మీరాసె నుబువ్వత్, చాప్3, పేజీ79.
వ్యాఖ్యానించండి