దైవప్రవక్త(స.అ) యొక్క 10వ ఉత్తరాధికారి అయిన హజ్రత్ ఇమామ్ అలీ నఖీ(అ.స) జీవిత చరిత్ర సంక్షిప్తంగా...
బిస్మిల్లాహిర్రహ్మనిర్రహీమ్
ఇమామ్ అలీ నఖీ(అ.స), దైవప్రవక్త(స.అ) యొక్క 10వ ఉత్తరాధికారి. జిల్ హిజ్ మాసం 15వ తేది హిజ్రీ యొక్క 212 సంవత్సరంలో మదీనహ్ యొక్క చుట్టప్రక్కలకు చెందిన ఒక ప్రదేశం అయిన “సిర్యా”లో జన్మించారు.[1] తండ్రి ఇమామ్ జవాద్(అ.స) తల్లి “సమానహ్”. ఇమామ్ యొక్క ప్రముఖ బిరుదులు “నఖీ” మరియు “హాదీ”, వారిని “అబుల్ హసనె సాలిస్” అని కూడా అంటారు.[2] ఇమామ్ హాదీ(అ.స) ఇమామత్ కాలం మొతసిమ్, వాసిఖ్, ముతవక్కిల్, ముంతసిర్, ముస్తయీన్, మొఅతజ్జ్ ఖలీఫాల అధికారంలో గడిచింది.
కొన్ని కారణాల వల్ల అబ్బాసీ ఖలీఫాల కాలం పరిస్థితులు ఇతర ఖలీఫాల కాలలతో పోలిస్తే మారాయి. చరిత్ర హిజ్రీ యొక్క 219 నుంచి 270వ సంవత్సరం వరకు 18 తిరుగుబాటు దాడులు జరిగాయి అని చెబుతుంది. ఇవన్నీ సరైన నాయకత్వం లేకపోవడంతో అబ్బాసీయుల ముందు అపజయానికి గురయ్యాయి.
ఇమామ్ హాదీ(అ.స) యొక్క ఎక్కువ కాలం ముతవక్కిల్ ఖిలాఫత్ కాలంలో గడిచింది. అతడి ప్రవర్తన బనీ హాషింల పట్ల మంచిగా ఉండేదికాదు. అతడు వారిని నిత్యం అనుమానించేవాడు, వారిని నిందిస్తూ ఉండేవాడు. ఇమామ్ హాదీ(అ.స) పై నిఘా పెట్టడానికై తన పూర్వీకుల పద్ధతిని ఎంచుకొని ఇమామ్ హాదీ(అ.స)ను మదీనహ్ నుంచి సామెరాకు బదిలీ చేశాడు.
ముతవక్కిల్ ఆదేశానుసారం ఇమామ్ ను సామెరాకు తీసుకొచ్చారు. ఇంకా వారి నిలయం సిద్ధం కాలేదనే సాకుతో వారిని పెదవారికోసం నిర్మించబడ్డ నిలయంలో ఉంచారు. ఆరోజు ఇమామ్ అక్కడే ఉన్నారు. తరువాత రోజు వారిని వేరే చోటుకు మార్చారు.[3]
అక్కడ ఇమామ్ పైకి స్వేచ్ఛగా ఉన్నారు అని అనిపించినా ఒక కారాగారంలో ఉన్నట్లు ఉన్నారు. ఇమామ్ పై నిఘా ఉండేది. వారి రాకపోకలను కంట్రోల్ చేసేవారు.
ఇమామ్ హాదీ(అ.స) పై నిత్యం గట్టి నిఘా ఉన్నప్పటికీ, వారు కూడా వారి తండ్రి మాదిరి ప్రతినిధులను నియమించారు. వారు ద్వారానే ఇమామ్ తన షియా అనుచరుల సమస్యలను తీర్మానించేవారు.[4]
బనీ అబ్బాస్ అధికారంలో ఖలీఫాలు జ్ఞాన పరమైన మరియు సాంస్కృతిక అంశాల పట్ల ఆశక్తి చూపించేవారు. ఆ కాలంలో ఇతర దేశాల నుండి చాలా పుస్తకాలు అరబీ భాషలో అనువదించబడ్డాయి మరి ఇదే విషయం ప్రజల ఆలోచన విధానం మారిపోవడానికి కారణం అయ్యింది. అలాగే కలామ్(విశ్వాసాల సంభాషణ జ్ఞానం) వర్గాలు ఉదాహారణకు అషాయిరహ్ మరియు మోతజిలహ్ వర్గాల జోరు ఎక్కువయ్యింది; అల్లాహ్ కు శరీరం ఉందీ, మనిషికి స్వేచ్ఛలేదు అంతా అల్లాహ్ యే చేస్తాడు, ఖుర్ఆన్ అల్లాహ్ ఉన్నప్పటి నుండి ఉందా లేక తాజాగా అవతరింపబడినదా? లాంటి సందేహాలు పుట్టుకొచ్చాయి. ఇమామ్ ఇలాంటి సందేహాలకు జ్ఞాన పరంగా సమాధానం ఇచ్చి ముస్లిములు ఇలాంటి సందేహాల చిక్కులో చిక్కకుండా కాపాడేవారు.
ఇమామ్ హాదీ(అ.స)పై గట్టి నిఘా ఉన్నప్పటికీ వారు మౌనంగా కూర్చుండి పోలేదు తమ కార్యములను అప్పటి పరిస్థితులను బట్టి చేపట్టారు. వారు చేపట్టిన కార్యములలో అతి ముఖ్యమైనది వారు ప్రజలకు వివిధ రకాలుగా ఇమామత్ మరియు విజ్ఞాన స్థాయిని తమ మాటల ద్వార, సభలలో మరియు ప్రశ్నలకు జ్ఞాన పరమైన సమాధానాలతో తెలియపరిచి నమ్మకం కలిగించారు. అలాగే బనీ అబ్బాసుల అధికారం షరా పరమైనది కాదని తెలియపరిచారు. వారు చేసిన మరో కార్యం ప్రజలను ఇమామ్ మహ్దీ(అ.స) యొక్క అదృశ్య కాలానికి సిద్ధం చేయడం.
ఇమామ్ అలీ నఖీ(అ.స) ప్రాణాలతో ఉండడం మరియు వారు అప్పటి అధికారులతో కలిసి ఉండకపోవడం లాంటి వాటితో అధికారులు నిరంతరం భయానికి గురి అయి ఉండేవారు. దీనికి కేవలం వారిని హతమార్చడమే పరిష్కారం అని భావించారు. ఆ క్రమంలో ఇమామ్ అలీ నఖీ(అ.స)ను కూడా మనుపటి ఇమాములను విషమిచ్చి చంపినట్లే మోతజ్ అధికార కాలంలో చంపారు.[5]
ఇమామ్ అలీ నఖీ(అ.స) యొక్క ఇమామత్ పదవీ కాలం ఇంచుమించు 34 సంవత్సరాలు. వారు సామెరహ్ లో చంపబడ్డారు. వారు మరణించిన తరువాత వారి జనాజహ్ నమాజ్ ను వారి కుమారులైన హజ్రత్ ఇమామ్ హసన్ అస్కరీ(అ.స) చదివించారు. వారిని వారి ఇంట్లోనే ఖననం చేశారు.
రిఫరెన్స్
1. తబర్సీ, ఎఅలాముల్ వరా, తా3, తహ్రాన్, దారుల్ కుతుబ్ అల్ ఇస్లామియ, పేజీ355. షేఖ్ ముఫీద్, అల్ ఇర్షాద్, ఖుమ్, మన్షూరాతు మక్తబతి బసీరతీ, పేజీ327.
2. అబుల్ హసనె అవ్వల్ అనగా ఇమామ్ మూసా కాజిమ్(అ.స), అబుల్ హసన్ సాని అనగా ఇమామ్ రిజా(అ.స).
3. షేఖ్ ముఫీద్, అల్ ఇర్షాద్, ఖుమ్, మక్తబతు బసీరతీ, పేజీ334.
4. మహ్దీ పీష్వాయీ, సీరయె పీష్వాయాన్, ఇమామ్ హాదీ(అ.స) జీవిత చరిత్ర అధ్యాయం నుంచి.
5. మహ్దీ పీష్వాయీ, సీరయె పీష్వాయాన్, భాగం2, పేజీ612.
వ్యాఖ్యానించండి